ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు

19 Oct, 2013 17:29 IST|Sakshi
దేవరగట్టు ఆలయంపై ఉన్న మాళ మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాలు నెరణికి చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగిశాయి.

దేవరగట్టు ఆలయంపై ఉన్న మాళ మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాలు నెరణికి చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నెరణికి గ్రామ పురోహితుల గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం రాత్రి ముగింపు పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా నెరణికి గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో కొండపై వెలసిన మాళ సహిత మల్లేశ్వరస్వామి మూలవిరాట్లు, ఉత్సవ విగ్రహాలను సాయంత్రం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఊరేగింపుగా దేవరగట్టు ఆలయానికి తెచ్చారు. అక్కడి నుంచి పల్లకిలో నెరణికి గ్రామానికి తీసుకెళ్లేందుకు దేవరగట్టు నుంచి ప్రారంభమైన ఊరేగింపు కొత్తపేట మీదుగా నెరణికితండాకు సమీపంగా రాత్రి నెరణికి గ్రామానికి చేరుకుంది.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వందలాది యువకులు బన్ని ఉత్సవాన్ని తలపించేలా గాలిలో కర్రలు తిప్పుతూ నృత్యం చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోగానే మూడు గ్రామాల ప్రజలు మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయానికి చేర్చి ఉత్సవానికి ముగింపుగా పూజలు నిర్వహించారు. ఆలూరు సీఐ వెంకటరామయ్య ఆధ్వర్యంలో హొళగుంద, ఆస్పరి, ఆలూరు, హాలహర్వి ఎస్‌ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
 
కర్రల సమరం కానేకాదు..
దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 వతేదీన జరిగిన బన్ని ఉత్సవాన్ని కర్రల సమరంగా పేర్కొనడాన్ని ఆలయ ప్రధాన పురోహితుడు సుబ్రహ్మణ్యంశాస్త్రి తప్పుపట్టారు. ముగింపు పూజల సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకే బన్ని ఉత్సవం నిర్వహిస్తున్నారు తప్పితే మరేమి కాదన్నారు.  ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉంటారన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, పోలీసులు,  ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు