తప్పులుంటే విపక్షనేత ఎత్తిచూపాలి: దేవినేని

27 Nov, 2014 04:04 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల్లో 126 టీఎంసీల నీరు ఉన్నా రాష్ట్రంలో సాగునీటి అవసరాల కోసం ఇంకా 54 టీఎంసీల నీరు అవసరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం ఇక్కడి ఇరిగేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని  విమర్శలు చేశారు.  తప్పులుంటే ఎత్తిచూపాలి గానీ విపక్ష నేతగా ప్రజలిచ్చిన బాధ్యతను ఆయన మరిచిపోయారన్నారు.
 
 ‘‘రూ.వెయ్యి పెన్షన్ ఇస్తుంటే మమ్మల్ని రాళ్లతో కొట్టిస్తావా? సీఎం మీద రాళ్లు వేయిస్తావా? మీవి విపక్ష నేత మాట్లాడే మాటలేనా? భవిష్యత్ తరాలకు మనం నేర్పే భాషేనా ఇది? ఎర్రచందనాన్ని దోచుకుంటుంటే అధికారంలో ఉన్నపుడు ఎందుకు అరికట్టలేకపోయారో రఘువీరారెడ్డి సమాధానం చెప్పాలి’’ అన్నారు. విదేశీ పర్యటనలకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో వెళ్లడాన్ని ఉమా సమర్థించుకున్నారు. సాక్షి మీడియా, చానల్‌ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భేటీలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు