శత్రువులతో టీడీపీ పొత్తా!

19 Sep, 2018 12:24 IST|Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబు అధికారం కోసం ఎదైనా చేస్తారని బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌తో జతకట్టడం సిగ్గుచేటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. నరసన్నపేట నియోజకవర్గంలోని పోతయ్యవలసలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అందించిన సుపరిపాలన మళ్లీ ప్రజలకు అందుతాయని ఆకాంక్షించారు.

ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలం తెలికిపెంట, పర్వతాలపేట గ్రామాల్లో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం టీడీపీ వళ్లే సర్వనాశనం అయిందన్నారు. అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో ఆర్‌ఎల్‌పురం పంచాయతీ మామిడిపల్లిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి నవరత్నాల పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో కొండతెంబూరు, సుభద్రాపురం గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ పర్యటించారు.

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో కొండకుంకాం, ఇజ్జుపేట, లక్ష్మీనారాయణపురం, లింగాలవలస గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.

పలాస నియోజకవర్గంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గం తులసిగాం గ్రామంలో పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో పర్యటించి గ్రామస్తులతో మమేకం అయ్యారు.

మరిన్ని వార్తలు