నాడు సర్పంచ్‌..నేడు స్వీపర్‌

12 Feb, 2018 08:34 IST|Sakshi
మంగళంపాడులో మాజీ సర్పంచ్‌ సుబ్బమ్మ నివసించే పూరిగుడిసె (ఇన్‌సెట్లో) ఇంగిలాల సుబ్బమ్మ

దళిత మహిళపై వివక్ష    

 పాలన బాధ్యతలు పెత్తందారులదే

మహిళా సాధికారత అంటూనే ఆ మహిళను వివక్షకు గురి చేస్తోంది. ప్రజాపాలనలో సమానత్వం కల్పిస్తున్నామని చెబుతున్న రాజకీయ పెత్తందారులు మహిళను ఉత్సవ విగ్రహంగా మార్చేస్తున్నారు. చట్ట సభలు, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పన అనే అధికారికంగా చట్టానికి నోచుకోకపోయినా ‘స్థానిక’ సంస్థల్లో సగం రిజర్వేషన్‌ పుణ్యమా అని ప్రజాప్రతినిధులుగా పదవులను అలకరించినా.. ఆ గౌరవం కొన్నాళ్లే. తిరిగి పాత జీవితం గడపాల్సిందే. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు మాజీ సర్పంచ్‌ జీవితమే ఉదాహరణ.

నెల్లూరు జిల్లా / సూళ్లూరుపేట: మండలంలోని మంగళంపాడుకు ఐదేళ్ల పాటు సర్పంచ్‌ స్థానంలో గ్రామ ప్రథమ పౌరురాలిగా ఇంగిలాల సుబ్బమ్మ ప్రజల ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు.  ఆమె ఇప్పుడు చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా పని చేస్తోంది. సర్పంచ్‌గా ఐదేళ్లు పని చేసినా పాలనలో ఆమె పెత్తనం ఏమీ లేకుండా పోయింది. సర్పంచ్‌ కాక ముందు కంటే సర్పంచ్‌ అయ్యాక ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుడు ఉన్న పూరింట్లోనే ఇప్పుడూ ఉంటుంది. కనీసం పక్కా ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది.

ఆమె పాలనపై పెత్తనం చెలాయించిన పెత్తందారులు మాత్రం నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జా.. డాబు ప్రదర్శిస్తున్నారు. 2006లో మంగళంపాడు పంచాయతీని ఎస్సీ మహిళకు కేటాయించడంతో టీడీపీ మద్దతురాలిగా ఆ గ్రామంలోని ఆ పార్టీ నాయకులు ఆమెను బరిలోకి దింపారు. ఆమె సర్పంచ్‌ కాక ముందు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. సర్పంచ్‌ అయ్యాక కూలి పనులకు వెళ్లలేకపోయింది. పూటగడవటం కష్టంగా మారింది. అయినా తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు జనాలను సమీకరించడం,

 ఇతర కార్యక్రమాలకు వెళ్లడం మినహా ఆమె తనకంటూ నాయకత్వ పటిమను పాదుగొల్పులేకపోయింది. ఆమెను శాసించిన నాయకులు ఉత్సవ విగ్రహంగా మార్చేసుకున్నారు. సంతకాలు అవసరమైన చోట సంతకాలు చేయించుకున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తిరిగి ఆమె జీవితం దుర్భరంగా మారింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడికి పెళ్లయి వేరుగా ఉంటున్నాడు. మరో కుమారుడు చదువుతున్నాడు.

ఐదేళ్ల పాటు పైసా కూడా కూడబెట్టుకోకపోవడంతో ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టతరం కావడంతో స్థానికంగా ఓ హోటల్‌లో పాచి పనికి చేరింది. ఆమె దుస్థితిని చూసిన కొంతమంది చలించిపోయి ఆమెను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా చేర్చారు. ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఉన్నత వర్గాల వారు మాత్రం స్థిర పడిపోతున్నారు. చదువు లేని ఇలాంటి మహిళలు మాత్రం సంతకాలకే పరిమితం కావడంతో మహిళా సాధికారత అపహాస్యం పాలవుతోంది. ఇలాంటి సుబ్బమ్మలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అధికారం వచ్చినా అనుభవించనీకుండా పెత్తనం చేసే ఉన్నత వర్గాల వారు చెప్పినట్టుగా చేయాల్సి ఉండటం చూస్తే మహిళకు సాధికారత వచ్చిందా? ఇంకా వివక్షకు గురవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనపించడం లేదు.

 కనీసం ఇల్లు కూడా కట్టుకోమన లేదు
ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశాను. ప్రస్తుతం అమ్మవారి సేవలో జీవితం గడిచి పోతుందని అనుకుంటున్నాను. సర్పంచ్‌గా పని చేసి  కనీసం ఇల్లు కూడా నిలబెట్టుకోలేకపోయాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఒక ఇల్లు కట్టుకోమని ఎవరూ చెప్పలేకపోవడంతో ఇప్పటికీ పూరి గుడిసెలోనే జీవితం గడుపుతున్నాం. సర్పంచ్‌గా ఉన్న కాలంలో కూడా సంతకాలనే పరిమితమయ్యాను. కనీసం రూపా యి సంపాదన లేకుండా పోయింది. భర్త పనికి పో లేకపోవడంతో నేను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా పనిచేసి ఆయన్ను పోషించుకుంటున్నాను.
– ఇంగిలాల సుబ్బమ్మ, మాజీ సర్పంచ్‌ మంగళంపాడు 

మరిన్ని వార్తలు