జయహో నాయకా | Sakshi
Sakshi News home page

జయహో నాయకా

Published Mon, Feb 12 2018 8:45 AM

YS Jagan Mohan Reddy Praja Sankalpa Yatra in  Nellore district - Sakshi

పింఛన్‌ ఇప్పించండయ్యా!
నెల్లూరు(టౌన్‌) : ‘మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా.. ఇప్పటికే డయాలసిస్‌ చేయిస్తున్నా.. డాక్టర్లు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు. నాకు కనీసం పింఛన్‌ ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగుతున్నా పట్టించుకోవట్లేదయ్యా’ అంటూ జలదంకి మండలం కొత్తపాళేనికి చెందిన తిరుగాబత్తిన ప్రభాకర్‌ ఆదివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయాడు. ముక్కు నుంచి నీరు అధికంగా కారుతూ ఊపిరి తీసుకోలేనంత ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని పోషించడం కూడా కష్టంగా ఉందని పేర్కొన్నాడు. పింఛన్‌ ఇస్తే కొన్ని ఇబ్బందులు తొలుగుతాయని జననేత వైఎస్‌ జగన్‌కు విన్నవించాడు.
           


నీ సంతకం అపురూపం అన్నా..
కావలిరూరల్‌: కలిగిరి మండలంలోని తూర్పుగుడ్లదొన వద్ద ఇద్దరు విద్యార్థినులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోగ్రాఫ్‌ తీసుకుని మురిసిపోయారు. పాదయాత్ర సాగుతుండగా గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎ.పూజిత, 6వ తరగతి విద్యార్థిని ఎన్‌.సమీర జననేత వద్దకెళ్లి ఆటోగ్రాఫ్‌ అడిగి తీసుకున్నారు. జగనన్న అధికారంలోకి వస్తే తమ చదువులకయ్యే ఖర్చు మొత్తం ఇస్తామని భరోసా ఇచ్చారని వారు తెలిపారు.


పింఛను కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా
ఉదయగిరి: కలిగిరి మండలం అనంతపురం ఎస్సీ కాలనీకి చెందిన బొడ్డు చిన్నమ్మ కొన్నేళ్లనుంచి పింఛను కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించలేదంటూ ఆదివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఉండటానికి ఇల్లు లేదని, చెట్టుకిందనే కాపురం ఉంటున్నానని వాపోయింది. పనిచేసే శక్తి లేక పింఛను రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలు ఉపాధి కోసం వారి దారిన వారు వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉన్నానని పేర్కొంది. స్పందించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘అవ్వా.. ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుంది. నీకు రూ.2వేలు పింఛను కచ్చితంగా వస్తుంది’ అని హామీ ఇచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement