నేదురుమల్లి కుటుంబంలో డిష్యుం డిష్యుం

17 Apr, 2015 11:08 IST|Sakshi
నేదురుమల్లి కుటుంబంలో డిష్యుం డిష్యుం

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఎన్బీకేఆర్ విద్యాసంస్థల మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలన్న అంశంపై కుటుంబంలోని ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. చైర్మన్‌గా తనకే అధికారాలున్నాయంటూ నేదురుమల్లి పద్మనాభరెడ్డి గురువారం నాడు కాలేజీకి రాగా.. ఆయనకు టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ పూలమాల వేసి ఆహ్వానం పలికారు. పద్మనాభరెడ్డి రాకతో కళాశాలలో వాతావరణం వేడెక్కింది. ఈ విద్యాసంస్థలకు తానే శాశ్వత అధ్యక్షుడనని, విద్యాసంస్థలపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని స్పష్టంచేశారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

రాంకుమార్‌రెడ్డిని అడ్డుకున్న సిబ్బంది
ఆ తర్వాత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు, విద్యాసంస్థల కరస్పాండెంట్ రాంకుమార్‌రెడ్డి వచ్చేందుకు ప్రయత్నించగా కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. పద్మనాభరెడ్డి సారథ్యంలోనే కళాశాల నడవాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంకుమార్‌రెడ్డి అనుచరులు ఇద్దరు కళాశాల సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వాళ్లపై సిబ్బంది తిరగబడ్డారు. కళాశాలపై సర్వహక్కులు తనకు ఉన్నాయని రాంకుమార్ రెడ్డి అన్నారు. ఇరువర్గాలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు.

మోహరించిన ఇరువర్గాలు
రాత్రి వరకు కళాశాలలోనే రాంకుమార్‌రెడ్డి, పద్మనాభరెడ్డి ఉండటంతో పోలీసులకు ఇరువర్గాలను నియంత్రించడం కష్టంగా మారింది. కళాశాల వెలుపల సాయంత్రం ఇరువర్గాల అనుచరులు కత్తులు, కర్రలతో దాడికి సిద్ధమవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అయినా ఇరువర్గాలు శాంతించలేదు. దీంతో సీఐ రత్నయ్య చర్చలు త్వరగా ముగించాలని నాయకులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు