సహకార స్ఫూర్తికి విఘాతం

25 Aug, 2013 02:25 IST|Sakshi
సహకార స్ఫూర్తికి విఘాతం

నర్సీపట్నం, న్యూస్‌లైన్ : సహకార స్ఫూర్తికి విఘాతం ఏర్పడింది. బక్షీ కమిటీ సిఫారసు మేరకు మూడంచెల వ్యవస్థలోని సొసైటీలపై ప్రభుత్వం వేటు వేసింది. కొత్త బ్యాం కింగ్ విధానాలు అమలు కాలేదంటూ.. వాటి యావదాస్తులను డీసీసీబీలో విలీనానికి నిర్ణయం తీసుకుంది. ఇది చిన్న, సన్నకారు రైతులకు గొడ్డలిపెట్టని చెప్పక తప్పదు. వారంతా రుణ పరపతి కోల్పోవడమే కాకుండా, సంఘాల్లోని ఉద్యోగులు రోడ్డున పడునున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)లు ఇంతకాలం రైతుల పాలిట కల్పతరువులా ఉండేవి. చిన్న, సన్నకారు రైతులకు సకాలంలో రుణాలిచ్చి ఆదుకునేవి.

అలాంటి వాటికి మంగళం పాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. మూడంచెల విధానం, స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థ పనితీరుపై నాబార్డు చైర్మన్ ప్రకాష్ బక్షి అధ్యక్షతన రిజర్వ్ బ్యాంకు ఒక కమిటీని నియమించింది. దాని సూచనల ఆధారంగా వీటిని రద్దుచేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 98 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు 3లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారికి ప్రస్తుతం సుమారు రూ. 250కోట్ల మేరు రుణాలివ్వగా, మరో రూ. 60కోట్లు వరకు డిపాజిట్లు చేశారు.
 
డీసీసీబీలో విలీనం

 
 మూడంచెల విధానం, సహకార పరపతి వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా లేదని, వీటిలో నూతన బ్యాంకింగ్ విధానాలు అమలు కావడం లేదంటూ కమిటీ వెల్లడించింది. అదే విధంగా వీటిలో కోర్ బ్యాంకింగ్ పద్ధతి పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదని తేల్చిచెప్పింది. దీంతో పీఏసీఎస్‌లన్నింటినీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో విలీనానికి రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈమేరకు వాటికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, డిపాజిట్లు సైతం డీసీసీబీలకు సంక్రమిస్తాయి.
 
రైతుల రుణాలకు ఇబ్బంది

 వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు రుణాలిచ్చేవి కేవలం పీఏసీఎస్‌లే. ఏటా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చి కొంతమేర ఆదుకుంటూ వస్తున్నాయి. వీటిని డీసీసీబీలో విలీనం చేస్తే, ఆ ప్రభావం రైతుల రుణాలపై పడుతుంది. అన్నదాతలకు రుణాలివ్వడంలో జాతీయ బ్యాంకుల శల్యసారథ్యం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలోని సొసైటీల్లో సుమారు 300 మంది పనిచేస్తున్నారు. సొసైటీల ఆస్తులను విలీనంతో వారికి ఎటువంటి పని ఉండదు. వారిని డీసీసీబీకి బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండాలంటూ నిబంధనల్లో పేర్కొంది. అలా అయితే ఉద్యోగులందరికీ పని ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వారంతా ఆందోళన బాట పట్టారు. అలాగే ఇటీవల ఎన్నికయిన పీఏసీఎస్‌ల అధ్యక్షులు సైతం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతారు.
 

మరిన్ని వార్తలు