రూ.102 కోట్ల విలువైన పథకాలు పంపిణీ

27 Jan, 2015 08:01 IST|Sakshi

ఒంగోలు సబర్బన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో సోమవారం  కలెక్టర్ విజయకుమార్ రూ.102 కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 3,409 మంది లబ్ధిదారులకు ఈ పథకాలను అందించారు. డీఆర్‌డీఏ, వెలుగు పథకాల కింద సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు బ్యాంక్ లింకేజీ ద్వారా మొత్తం 3,250 మందికి లబ్ధి చేకూరేలా రూ.101 కోట్లు వివిధ పథకాలను పంపిణీ చేశారు. ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూలు గిరిజన బాలికలకు 26 సైకిళ్లు అందించారు.

ఈ సైకిళ్ల విలువ రూ.1.17 లక్షలు. వికలాంగుల సంక్షేమశాఖకు సంబంధించి మూడు చక్రాల సైకిళ్లు 23 అందించారు. వీటి విలువ రూ.1.12 లక్షలు. గిరిజన కార్పొరేషన్‌లో వివిధ పథకాల కింద చిరువ్యాపారులు 18 మందికి  రూ.2.70 లక్షల రుణాలు అందించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 24 కులాంతర వివాహాల దంపతులకు రూ.4.80 లక్షలు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. షెడ్యూల్డు కులాల కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 36 మందికి సబ్సిడీతో కూడిన రుణాలను అందజేశారు. వాటి విలువ రూ.22.25 లక్షలు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో  32 మంది లబ్ధిదారులకు  రూ.68.80 లక్షల రుణాలు ఇచ్చారు.  

మత్స్యకారులకు 63 మందికి టీవీఎస్ మోపెడ్, చేపలు విక్రయించేందుకు ఐస్‌బాక్సులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.9 వేలు సబ్సిడీతో వీటిని అందించారు. మినీట్రాక్టర్ పంపిణీకి సిద్ధంగా ఉంచటంతో కలెక్టర్ విజయకుమార్ మినీ ట్రాక్టర్‌ను నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మొత్తం 19 స్టాల్స్‌ను, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఏర్పాటు చేశారు. స్టాల్స్‌ను కలెక్టర్‌తో పాటు ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, ఏఎస్పీ, జెసి, ఏఆర్ ఏఎస్పీ కృష్ణయ్య, ఒంగోలు డిఎస్పీ జి. శ్రీనివాసరావులు సందర్శించారు.
 

మరిన్ని వార్తలు