నిరీక్షణ ఫలించింది

1 Oct, 2013 04:23 IST|Sakshi

 నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ :  జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న ఖైదీల నిరీక్షణ ఫలించింది. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో హాయిగా గడపాలనే వారి కల నెరవేరనుంది. రెండేళ్ల పాటు  క్షమాభిక్ష జీఓ ఇదిగో, అదిగో అంటూ ఖైదీలను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 28న జీఓఎంఎస్ నంబర్ 220ను విడుదల చేసింది.
 
 
 అక్టోబర్ 2వ తేదీ వరకు శిక్ష కాలాన్ని లెక్కించి మార్గదర్శకాల ప్రకారం విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో  కేంద్ర కారాగార ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఎంఆర్ రవికరణ్ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను తయారుచేసే పనిలో నిగమ్నమైయ్యారు. క్షమాభిక్ష జీఓ విడుదల కావడంతో జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. క్షమాభిక్ష జీఓ గతంలో నెల నుంచి రెండు నెలల ముందుగానే జిల్లా కేంద్ర కారాగారానికి అందేది. అధికారులు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను వెంటనే తయారుచేసి ఉన్నతాధికారులకు పంపేవారు. దీంతో జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి సంబరాల్లోనే క్షమాభిక్ష పొందిన ఖైదీలను విడుదల చేసేవారు.
 
 ఈ సారి మాత్రం ప్రభుత్వం రెండు రోజుల ముందు జారీ చేయడంతో ఖైదీల విడుదల ప్రక్రియ ఆలస్యం కానుంది. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్‌లో కాని ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర కారాగారం నుంచి క్షమాభిక్ష కింద 13 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. తాజాగా గాంధీజయంతి (ఖైదీల సంక్షేమ దినోత్సవం) సందర్భంగా జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. జిల్లా కేంద్రకారాగారంలో 255 మంది జీవితఖైదు అనుభవిస్తుండగా, నూతన మార్గదర్శకాల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 27 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే తాజా మార్గదర్శకాలు కొందరు ఖైదీల విడుదలకు ప్రతిబందకాలుగా మారాయి. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు.
 
 27 మంది విడుదల :
 ఎంఆర్ రవికిరణ్, ఇన్‌చార్జి జైలు సూపరింటెండెంట్
 ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం 27 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. జాబితాను తయారు చేశాం. జాబితాను జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ద్వారా ప్రభుత్వానికి పంపుతాము. జాబితాను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం ఖైదీలను విడుదల చేస్తాం.
 

మరిన్ని వార్తలు