వైద్యులు యమధర్మరాజులు కాకూడదు

24 Dec, 2013 01:08 IST|Sakshi

లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: సమాజంలో రోగుల పట్ల వైద్యులు మానవతావాద దృక్పథంతో వ్యవహరించాలని, వైద్యులను పేషెంట్లు ధర్మరాజులుగా చూడాలి కానీ యమధర్మరాజుల్లా చూసే పరిస్థితి ఉండకూడదని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం ‘పీపుల్స్ ఫర్ బెటర్ ట్రీట్‌మెంట్’, ‘సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్’ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య నిర్లక్ష్యంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వైద్యులకు, వైద్యానికి సంబంధించిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లాంటివే సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. వైద్యవిభాగంలో నైతిక విలువలు పతనమయ్యాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే 2003లో మృతి చెందిందని, ప్రస్తుతం కేసు నడుస్తోందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఉస్మానియా ఆస్పత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు