డబ్బుల్.. ఇంక్రిమెంట్లు

11 Dec, 2013 03:07 IST|Sakshi

అర్హతలు లేకున్నా అదనపు ఇంక్రిమెంట్లను అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల చిట్టా బయటపడింది. పదేళ్లుగా అధికారుల కళ్లుగప్పి సాగుతున్న ఈ బాగోతంతో జిల్లాలో దాదాపు రూ.కోటి సర్కారు సొమ్ము దుర్వినియోగమైంది. ఉపాధ్యాయుల జీతాలు సహా సర్వీసు వివరాలన్నీ జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్‌లో పొందుపరచటంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 39 మంది టీచర్లు అడ్డదారిలో ఇంక్రిమెంట్లను లబ్ధి పొందినట్లు ఇప్పటికే లెక్క తేలింది. స్వయంగా డీఈవో లింగయ్య ఆన్‌లైన్‌లో కొన్ని మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు పరిశీలించి ఈ గోల్‌మాల్‌ను వెతికి పట్టుకున్నారు. అదే తీరుగా అన్ని మండలాలను గాలిస్తే.. అడ్డదారిలో సర్కారు సొమ్మును మింగేసిన టీచర్ల సంఖ్య వందకు మించుతుందని అంచనా వేస్తున్నారు. తిరిగి ఈ సొమ్మును ఎలా రికవరీ చేయాలి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చూసీచూడనట్లుగా ఇంక్రిమెంట్లు జారీ చేసిన హెచ్‌ఎంలు, ఎంఈవోలకు ఈ అక్రమంలో ఎంతమేరకు ప్రమేయముంది? అనే కోణంలో జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
 
 పధానంగా ఎస్జీటీలు, పీఈటీలు ఈ అక్రమానికి పాల్పడ్డట్లు తేలింది. నిబంధనల ప్రకారం... 24 ఏళ్ల సర్వీసు నిండిన ఎస్జీటీలు, పీఈటీలకు యాంత్రిక పదోన్నతి స్కేలు మంజూరవుతుంది. 2003 జూలై నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.... డిగ్రీ, బీఎడ్‌తోపాటు కనీసం రెండు డిపార్టుమెంట్ టెస్టులు విధిగా పాసైన వారికే యాంత్రిక పదోన్నతి స్కేలు పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
 
 కానీ.. ఇంటర్, టీటీసీ ఉన్న టీచర్లు సైతం అడ్డదారిలో ఈ స్కేలును అందుకొని అక్రమాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మరో ఇంక్రిమెంట్‌కు ఎసరు పెట్టారు. 24 ఏళ్ల సర్వీసు తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ పొందిన ఎస్జీటీ, పీఈటీలు ఎఫ్‌ఆర్-22 (ఏ)1, 31(2) ప్రకారం వేతన స్థిరీకరణతోపాటు ఒక ఇంక్రిమెంట్ పొందేందుకు అర్హులవుతారు. కానీ.. తమకు వర్తించని ఎఫ్‌ఆర్ 22(బి) చూపించి రెండు ఇంక్రిమెంట్లు అందుకున్నారు. నిజానికి ఈ నిబంధన 24 ఏళ్ల సర్వీసు కంటే ముందుగా ప్రమోషన్ అందుకున్న టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. అదేమీ పట్టించుకోకుండా అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ను కొల్లగొట్టిన 39 మంది టీచర్లను అధికారులు వెతికి పట్టుకున్నారు.
 
 పధానంగా భీమదేవరపల్లి, రామగుండం మండలాల్లో ఈ అక్రమం బయటపడింది. జిల్లా అంతటా వెతికితే.. ఈ సంఖ్య అంతకంతకు పెరిగిపోతుందని అధికారులు అనుమానిస్తున్నారు. పదేళ్లుగా ఈ డబుల్ ఇంక్రిమెంట్లతో దాదాపు రూ.కోటి సర్కారు సొమ్ము లూటీ అయినట్లు భావిస్తున్నారు. ఈ నిధుల రికవరీతోపాటు విద్యాశాఖ తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే భయాందోళన అక్రమార్కులను వెంటాడుతోంది. వీరికి ఇంక్రిమెంట్లు జారీ చేసిన హెచ్‌ఎంలు, ఎంఈవోలతో పాటు బిల్లులు మంజూరీ చేసిన ట్రెజరీ విభాగానికి సైతం ఈ భాగోతం కంటి మీద కునుకు లేకుండా చేసింది.
 

మరిన్ని వార్తలు