డీపీఆర్‌ పట్టాలపై విశాఖ మెట్రో

4 Jun, 2020 09:37 IST|Sakshi

యూఎంటీసీకి లైట్‌ మెట్రో, ట్రామ్‌ కారిడార్‌ డీపీఆర్‌ బాధ్యతలు 

ఇప్పటికే లైట్‌ మెట్రో డీపీఆర్‌ తయారీలో నిమగ్నం

వారం రోజుల్లో ‘మోడ్రన్‌ ట్రామ్‌’పై అగ్రిమెంట్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు అవరోధాల్ని అధిగవిుస్తూ ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులో మార్పులకు అనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారు చేసేందుకు సర్వం సిద్ధమైంది. మెట్రో ప్రాజెక్టుకి కొత్త డీపీఆర్‌ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) డీపీఆర్‌ తయారు చేసేందుకు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్‌ తయారీ కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ), రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌(రైట్స్‌), అర్బన్‌ మాస్‌ ట్రాని్సస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌(యూఎంటీసీ) సంస్థలకు మాత్రమే అనుమతినివ్వడంతో సంబంధిత సంస్థలు తమ టెండర్లను ఏఎంఆర్‌సీకి అందించాయి.

గతంలో రూపొందించిన 42.55 కి.మీ డీపీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తూ 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) బాధ్యతల్ని రూ.5,33,50,600లకు టెండర్‌ వేసిన అర్బన్‌ మాస్‌ ట్రాని్సస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌(యూఎంటీసీ)కు మార్చి 20వ తేదీన అప్పగించారు. గతంలో రూపొందించిన 46.40 కిలోమీటర్ల మెట్రో డీపీఆర్‌ని అప్‌డేట్‌ చేస్తూ మొత్తం పొడిగించిన మేర రిపోర్టు తయారు చెయ్యాలని ఏఏంఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. పీపీపీ పద్ధతిలో రూపొందించనున్న ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ని ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని సదరు సంస్థకు సూచించింది. అదే విధంగా మార్చి 27న మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌ డీపీఆర్‌ తయారీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనేది తేలాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో టెండర్లను ఓపెన్‌ చేసిన ఏఎంఆర్‌సీ.. అత్యంత తక్కువ రూ.3,37,67,200 కోడ్‌ చేసిన అర్బన్‌ మాస్‌ ట్రాని్సట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ)కు అప్పగించారు.

ఆరు నెలల్లో పూర్తి చేసేలా....
లైట్‌మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించి రెండు డీపీఆర్‌లు తయారు చేసే బాధ్యతలను యూఎంటీసీ దక్కించుకుంది. ఇప్పటికే 20 శాతం వరకూ లైట్‌ మెట్రో డీపీఆర్‌ని పూర్తి చేసింది. వచ్చే వారంలో ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ అగ్రిమెంట్‌పై ప్రభుత్వం సమక్షంలో యూఎంటీసీ, ఏఎంఆర్‌సీ సంతకాలు చెయ్యనున్నాయి. అనంతరం సవివర ప్రాజెక్టు తయారీ పనులు చేపట్టనుంది. మొత్తంగా రెండు డీపీఆర్‌లూ ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

8న బోర్డు సమావేశం
అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పేరును ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మారుస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 8న విజయవాడలో బోర్డు మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత 9వ తేదీన రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి పేరు మార్పు అంశాన్ని పంపించనున్నారు. అక్కడ అప్రూవ్‌ పొందితే..10వ తేదీ తర్వాత అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) ఇకపై ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏపీఎంఆర్‌సీ)గా పూర్తిగా మార్పు చెందుతుందని అధికారులు తెలిపారు.

డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే బిడ్డింగ్‌కు..
ఆరు నెలల్లో లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌ తయారు చేయాలని గడువు నిర్దేశించాం. లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌ 5 నెలల్లో సిద్ధం కానుంది. ట్రామ్‌ 6 నెలల్లో పూర్తవుతుంది. రెండు డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే వాటిని పరిశీలించి.. బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. మెట్రోరైలు ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
– రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా