కోస్తా తీరంలో ఇండో–అమెరికా త్రివిధ దళాల కసరత్తు

6 Nov, 2019 08:44 IST|Sakshi
కాకినాడ సాగరతీరంలో ఆర్మీ సిబ్బంది విన్యాసాలు

సాక్షి, కాకినాడ : సాగరతీరంలో త్రివిధ దళాల విన్యాసాల కసరత్తు నిర్వహించేందుకు ఆర్మీ, నేవీ సిబ్బంది కోస్తా తీరాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. మంగళవారం కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లో యుద్ధట్యాంకర్లతో సైనికులు ట్రైల్‌రన్‌లు, గస్తీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ బీచ్‌లో నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఇండో–అమెరికా త్రివిధ దళాల విన్యాసాల కోసం రెండు రోజులుగా కసరత్తులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఆస్తి, ప్రాణనష్టం నివారణ కోసం, దేశరక్షణ, యుద్ధ సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాల ఆధ్వర్యంలో నిర్వహించే విన్యాసాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు.

దీనిలో భాగంగా మంగళవారం విశాఖ నేవెల్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘర్మోడే ఆధ్వర్యంలో స్కై డ్రైవింగ్‌ చేసిన ఎనిమిది మంది కమాండోలు పారాచూట్లతో సాగరతీరంలో దిగారు. యుద్ధనౌకలు ఇన్‌షోర్, ఆఫ్‌షోర్, కేజీ బేసిన్‌ వంటి ఆయిల్‌ క్షేత్రాల రక్షణ కల్పించడంలో ఆర్మీ సిబ్బంది చేసిన కసరత్తు ఆకట్టుకుంది. యుద్ధ సమయంలో శత్రుదేశాలకు చెందిన యుద్ధ నౌకలు, ఆయిల్‌ రిగ్‌లను నాశనం చేసేందుకు జెమినీ బోట్లలో వచ్చిన కమాండోలను సివరింగ్‌ ఆపరేషన్‌ ద్వారా సమర్థంగా తిప్పికొటిన ఆపరేషన్, సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు హెలికాఫ్టర్‌ ద్వారా చేసిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ విన్యాసాలు, నేవీ క్రాస్‌ డెకింగ్, ఆర్మీ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కసరత్తులో త్రివిధ దళాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు