నీటి కష్టాలు వీడితే ఒట్టు!

24 Jul, 2018 10:53 IST|Sakshi
గాండ్లవీధిలో బిందెడు నీళ్లు పట్టుకోవడానికి బారులు తీరిన ప్రజలు

సూళ్లూరుపేట: పట్టణంలో ప్రతి కుటుంబం తాగునీరు కొనుగోలు చేసి తాగాల్సిందే. పేట జనాభా సుమారు 48 వేలమంది. 15 వేల కుటుంబాలున్నాయి. జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. మొత్తం పది ఓవర్‌హెడ్‌ ట్యాంకులున్నాయి. ఇందులో కొన్ని శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చివేశారు. అధికారుల సమాచారం ప్రకారం సమ్మర్‌ స్టోరేజీ నుంచి, ఇతరవాటి నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్లు ఇవ్వాలి. ఈ లెక్కన 48 వేల మందికి సుమారు 34 లక్షల లీటర్లు ఇవ్వాలి. అయితే 10 లక్షల లీటర్లు కూడా అందించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెనీరు అందడం గగనంగా మారింది. 

కొనాల్సిందే..
పట్టణంలో ప్రస్తుతం నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. మున్సిపాలిటీ 30 ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తోంది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తుంటే ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కళాక్షేత్రలో స్వజలధార కింద మున్సిపల్‌ స్థలంలో మున్సిపాలిటీ వనరులు, నీరు వాడుకుంటూ డాక్టర్స్‌ వాటర్‌ అనే సంస్థ నీటి వ్యాపారం చేస్తోంది. బిందెనీటిని రూ.4కు, 20 లీటర్ల క్యాన్‌ను రూ.15 విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కూడా ప్రకటనలకే పరిమితమైంది. 1వ వార్డు, 15వ వార్డు, 13వ వార్డుల్లో ప్లాంట్స్‌ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో క్యాన్‌ను రూ.20కు, బిందెనీటిని రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. ఓ అంచానా ప్రకారం నెలకు రూ.కోటి పైనే నీటి వ్యాపారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు