డ్రిప్.. డ్రాప్

1 Jul, 2014 01:47 IST|Sakshi
డ్రిప్.. డ్రాప్

 ఏలూరు : ప్రభుత్వ నిబంధనలు.. అధికారులు, వ్యాపారుల స్వార్థం జిల్లాలో బిందుసేద్యాన్ని కాటేస్తున్నాయి. అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు బిందుసేద్య (డ్రిప్ ఇరిగేషన్) విధానాన్ని అవలంభించాలని చెబుతున్న ప్రభుత్వం.. డ్రిప్ పరికరాలపై ఇచ్చే సబ్సిడీలో కోత విధించింది. మరోవైపు అధికారులు నాణ్యతలేని డ్రిప్ పరికరాలను కొనుగోలు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్నారు. అవి తరచూ మరమ్మతులకు గురవడంతో కర్షకులు సమస్యలతో సతమతం అవుతున్నారు. తోటల నుంచి డ్రిప్ యంత్రాలను తొలగిస్తున్నారు.
 
 సబ్సిడీ తగ్గింది
 జిల్లాలో 1.39 లక్షల హెక్టార్లలో కోకో, కొబ్బరి, నిమ్మ, ఆయిల్‌పామ్, అరటి, బత్తాయి వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. వీటిలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి పాటిస్తే విద్యుత్, నీరు ఆదా అవుతాయని, కూలీ ఖర్చులు తగ్గుతున్నాయని, మంచి దిగుబడులు లభిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం ఈ పరికరాలపై సబ్సిడీ ఇస్తోంది. దీంతో జిల్లాలో సుమారు 30శాతం మంది ఉద్యాన రైతులు బిందుసేద్యం చేస్తున్నారు. సాధారణంగా 7 గంటలపాటు విద్యుత్‌తో 3 ఎకరాల పంటకు నీరందిస్తే.. డ్రిప్ ద్వారా అదే సమయంలో 10 ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఈ కారణంగా రైతులంతా డ్రిప్ విధానంపై ఆసక్తి చూపారు. గతంలో ఈ పరికరాలపై ప్రభుత్వం 90శాతం సబ్సిడీ ఇచ్చేది. మూడేళ్ల క్రితం ఆ మొత్తాన్ని 40 శాతానికి కుదించింది. దీంతో కొత్తగా రైతులెవరూ బిందుసేద్యంపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పాత రైతులు డ్రిప్ పరికరాలను తొలగిస్తున్నారు. డ్రిప్ యంత్రాలు మరమ్మతులకు గురైన సందర్భాల్లో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. బయట మార్కెట్‌లో వీటికి సంబంధించిన పరికరాల ధరలు రెట్టింపయ్యూరుు. పైగా ఏ పరికరమైనా నాసిరకంగా ఉంటున్నారుు. ఈ పరిస్థితుల్లో డ్రిప్ వాడకం నుంచి రైతులు వైదొలుగుతున్నారు.
 
 ధర పెరిగింది
 గతంలో ఎకరం తోటలో డ్రిప్ ఏర్పాటు చేయూలంటే రైతుకు రూ.7 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.16 వేలు ఖర్చవుతోంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునే రైతులు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరిట సబ్సిడీ పోగా మిగిలిన మొత్తానికి డీడీ తీయూల్సి ఉంటుంది. అది అందిన వెంటనే డ్రిప్ యంత్రాన్ని ఎంపిక చేసిన కంపెనీల ద్వారా రైతులకు అందిస్తారు. డ్రిప్ యంత్రాలు గతంలో నాణ్యంగానే ఉన్నా ఇప్పుడా పరిస్థితి లేదు. ధరలు చూస్తే రెట్టింపు అయ్యూరుు. డ్రిప్‌కు వాడే 16 ఎంఎం ట్యూబ్ మీటరు ధర గతంలో రూ.5.80 ఉండేది. ప్రస్తుతం రూ. 9.50కి పెరిగింది. డ్రిప్‌లో స్క్రీన్ ఫిల్టర్ గతంలో రూ.3 వేలు ఉండేది. ప్రస్తుత ధర రూ.4,500 వరకు ఉంది. గతేడాది హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ రూ.5,500 ఉండేది. ప్రస్తుతం రూ.8వేలకు పెరిగింది. ఇంత ఖర్చుచేసినా నాణ్యతలేని పరికరాలు అందుతున్నాయని రైతులు చెబుతున్నారు. బాల్ వాల్వ్స్ నుంచి ప్రతి వస్తువు ధర చుక్కల్లో ఉంటే, నాణ్యత మాత్రం డొల్లగా ఉంటోంది. హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లు మరమ్మతులకు గురైతే ఆ సామగ్రి కోసం విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి డ్రిప్‌పై ఇచ్చే సబ్సిడీ పెంచాలని, ఒకసారి తీసుకున్న డ్రిప్ పూర్తిగా పాడైతే.. సబ్సిడీపై కొత్త డ్రిప్‌ను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వీటి నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 సబ్సిడీ పెంచాలి
 డ్రిప్ యంత్రాలను గతంలో మాదిరిగానే 90 శాతం సబ్సిడీపై అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బిందుసేద్యంపై రైతులు ఆసక్తి చూపుతున్న సమయంలో ధరలు పెరుగుదల, సబ్సిడీలో కోత, నాసిరకం వస్తువుల విక్రయాల వల్ల రైతులు నిరాశ చెంది వీటి వినియోగాన్ని బాగా తగ్గిం చారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు మేలు చేయాలి.
 -గంటా సత్యనారాయణ, రైతు, తిమ్మాపురం
 
 ఇబ్బందులు పడుతున్నాం
 ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న స్క్రీన్ ఫిల్టర్, హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లలో నాణ్యత బాగా తగ్గింది. ఎనిమిదేళ్లకు పైగా పనిచేయాల్సిన డ్రిప్ యంత్రం కనీసం రెండేళ్లు కూడా పనిచేయడం లేదు. ఫిల్టర్లు ప్రతి రెండు, మూడు నెలలకు పాడైపోతున్నాయి. పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. సమస్య లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
 -జి.శ్రీనివాసరావు, రైతు, తిమ్మాపురం
 

మరిన్ని వార్తలు