వేగానికి కళ్లెం!

30 Apr, 2017 13:12 IST|Sakshi
వేగానికి కళ్లెం!

► రేపటినుంచి స్పీడ్‌ గవర్నర్లు తప్పనిసరి
► లేకుంటే ఎఫ్‌సీలు, పర్మిట్ల నిరాకరణ
► ట్రాన్స్‌పోర్టు.. ఆర్టీసీ వాహనాలకూ వర్తింపు
► ఆదేశాలు జారీచేసిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల ను నివారించడంలో భాగంగా వేగానికి కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రయాణికులను, సరుకులు తీసుకెళ్లే వాహనాలు తప్పనిసరిగా స్పీడ్‌ గవర్నర్లు అమర్చుకోవాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. మే 1వ తేదీ నుంచి ఆదేశాలు అమలు చేయాలని.. లేకుంటే ఎఫ్‌సీలు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో దీని ప్రభావం
30 వేల వాహనాలపై పడనుంది.

చిత్తూరు (అర్బన్‌): రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎనిమిది కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లే వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్‌ గవర్నర్లను అమర్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ప్యాసింజర్‌ ఆటోలు, 3,500 కిలోల లోపున్న వాహనాలకు ఈ నిబంధనలు వర్తించవు. ఈ లెక్కన జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ట్రాన్స్‌పోర్టు (ప్రయాణికుల్ని తీసుకెళ్లేవి) వాహనాలు దాదాపు 19 వేల వరకు ఉన్నాయి.

ఇవి కాకుండా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు కలిపి 16 వేల వరకు ఉన్నాయి. ఈ వాహనాలన్ని తప్పనిసరిగా స్పీడ్‌ గవర్నర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందే. స్పీడ్‌ గవర్నర్లను ఏర్పాటు చేసుకునే సమయంలో వాహనాల గరిష్ట వేగం గంటకు 80 కిలో మీటర్లు మించకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు. స్పీడ్‌ గవర్నర్ల  పరికరాలు భారత ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు లోబడి తయారై ఉండాలి. అయితే 30 వేల వాహనాలకు కావాల్సిన స్పీడ్‌ గవర్నర్లు జిల్లాలో అందుబాటులో లేకపోవడం గమనార్హం.

లేకుంటే కష్టమే
స్పీడ్‌ గవర్నర్లను అమర్చుకోని ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ), పర్మిట్లు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాహనాల వేగాన్ని  80 కి.మీ ల వరకు లాక్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గొచ్చని కేంద్రం భావిస్తోంది. కొత్తగా రిజిస్ట్రేషన్లకు వచ్చే ట్రాన్స్‌పోర్టు వాహనాలు స్పీడ్‌ గవర్నర్‌ పెట్టుకోకపోతే రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని చిత్తూరు ప్రాంతీయ రవాణాశాఖ ఇన్‌చార్జి అధికారి రవీంద్రనాథ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రోజుకు జిల్లా మొత్తంలో 80 వరకు ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఎఫ్‌సీలకు వస్తుం టాయని.. వీటిల్లో స్పీడ్‌ గవర్నర్లు ఉంచుకోకపోతే ఎఫ్‌సీలు నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. తిరుపతిలోని పలు దుకాణాల్లో రూ.5 వేల నుంచే ఇవి లభిస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు