6,100 పోస్టులకే డీఎస్సీ

6 Oct, 2018 03:53 IST|Sakshi

భర్తీ కావాల్సిన పోస్టులు 10,354

10న నోటిఫికేషన్‌.. నవంబరు 30న పరీక్ష

2019 జనవరి 3న ఫలితాలు

మంత్రి గంటా వెల్లడి

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఈ నెల 10వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. టెట్‌ కమ్‌ టీఆర్టీ విధానంలో ఉపాధ్యాయుల ఎంపిక కొనసాగుతుందన్నారు.

డీఎస్సీ పరీక్ష నవంబరు 30వ తేదీన నిర్వహించనున్నామని, 2019 జనవరి 3వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో 6,100 ఖాళీల భర్తీకి  ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుందని చెప్పారు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో మరో 3,175 ఖాళీలకు డీఎస్సీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని.. అయితే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  పాఠశాల విద్యా శాఖ అధికారులు 10,354 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. కేవలం 6100 పోస్టుల భర్తీకే అనుమతి వచ్చిందన్నారు.  

కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటుపై శ్వేతప్రతం
విభజన చట్టంలో హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేశామని చెబుతున్న జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు అయి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా అవి తాత్కాలిక భవనాలలోనే నడుస్తున్నాయని మంత్రి గంటా వివరించారు. జాతీయ విద్యా సంస్థలు మంజూరు, వాటి నిర్వహణ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి గంటా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ ఇటీవల రాష్ట్ర పర్యటనలో.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చెప్పిన దానికంటే ఎక్కువ చేసిందని మాట్లాడారని.. దీనిపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే  శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని జాతీయ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్‌ బోధన సిబ్బందే ఉన్నారని, పర్మినెంట్‌ ఫ్యాకల్టీ నియామకానికి కేంద్రం చొరవ చూపడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. 17 కేంద్ర విద్యా సంస్థలకు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 3,508 ఎకరాల భూమిని కేటాయించిందని గంటా వెల్లడించారు.

కేంద్రీయ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు, పూర్తిస్థాయి బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు వాటిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇప్పటికయినా పూర్తిస్థాయిలో విద్యా సంస్థలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతాపార్టీ నేతలను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. లేకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు