చిగురంత ఆశ

26 Jul, 2014 00:48 IST|Sakshi

రాయవరం : రెండేళ్లుగా ఊరిస్తున్న డీఎస్సీ సెప్టెంబర్ ఐదున జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెట్‌లో క్వాలిఫై అయినవారికి మాత్రమే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డీఎడ్, బీఎడ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నూతన బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీకి అవకాశం కల్పించాలని ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం  నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో సుమారు 1,800 మంది డీఎడ్ చేస్తున్న వారు ఉండగా సుమారుగా 4,200 మంది బీఎడ్ శిక్షణ పూర్తి చేసుకుని పోటీ ప్రపంచంలో అడుగిడబోతున్నారు.

 గత మార్చి 16న జరిగిన టెట్‌లో 19,921 మంది బీఎడ్ పూర్తి చేసినవారు పాల్గొనగా డీఎడ్ పూర్తి చేసినవారు 2,234 మంది పాల్గొన్నారు.

 ఎస్‌జీటీ పోస్టుల్లో బీఎడ్‌కు  అవకాశం ఉంటుందా?...
 డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఎడ్ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డీఎస్సీ 2014 నోటిఫికేషన్‌లోఎస్‌జీటీ పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పిస్తారని బీఎడ్ అభ్యర్థులు ఆశిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధించేందుకు కనీసం రెండేళ్లు కాలపరిమితి ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారే అర్హులనే నిబంధన ఉండడంతో సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీలో బీఎడ్ విద్యార్థులకు ఎలా అవకాశం కల్పిస్తారని డీఎడ్ అభ్యర్థ్ధులు ప్రశ్నిస్తున్నారు.

 ఎస్‌జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఆ తీర్పును పునః సమీక్షించాలంటే  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుందని బీఎడ్ అధ్యాపకుడు బొడ్డపాటి  సురేష్‌కుమార్ తెలిపారు. ఆమేరకు చర్యలు చేపడితేనే బీఎడ్ చేసినవారికి ఎస్‌జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లభిస్తుంది.

 పెరిగిన ఖాళీల భర్తీ ఉంటుందా ?
 జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు నోటిఫికేషన్ సమయానికి ఏర్పడిన ఖాళీలను కూడా  భర్తీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది 184 ప్రాథమికోన్నత పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి ఎనిమిదో తరగతిని నూతనంగా ప్రవేశపెట్టారు. ఆయా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
 
 ఖాళీలు 1,211
 ఈ ఏడాది మే నెలాఖరు నాటికి జిల్లాలో 1,211 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం. 190 స్కూల్ అసిస్టెంట్లు, 884 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 118 భాషా పండితులు, 19 వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.  

>
మరిన్ని వార్తలు