డీఎస్సీ మలిరోజూ ప్రశాంతం!

11 May, 2015 02:47 IST|Sakshi

5871 మంది లాంగ్వెజ్ పండిట్ అభ్యర్థులు హాజరు
919 మంది పీఈటీ అభ్యర్థులు హాజరు  
ఒక కేంద్రంలో ఉర్దూ మీడియం అభ్యర్థులకు సోషియల్ బదులు గణితం ప్రశ్నపత్రాలు సరఫరా
ఆందోళన చెందిన అభ్యర్థులు... తేరుకుని వెంటనే ప్రశ్నపత్రాలు మార్చిన అధికారులు

 
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 పరీక్షల్లో భాగంగా మలిరోజు ఆదివారం జరిగిన లాంగ్వెజ్ పండిృట్లు, పీఈటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన లాంగ్వెజ్ పండిట్ల పోస్టులకు మొత్తం 6428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 293 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 6135 మంది హాజరుకావాల్సి ఉండగా... 5871 మంది హాజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు. వీరికి 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అలాగే మధ్యాహ్నం జరిగిన పీఈటీ పరీక్షకు మొత్తం 1028 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 56 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 972 మంది హాజరుకావాల్సి ఉండగా... 919 మంది హాజరయ్యారు. 53 మంది గైర్హాజరయ్యారు. వీరికి 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.అంజయ్య ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

సోషియల్ బదులు గణితం ప్రశ్నపత్రాలు సరఫరా
 స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల కేంద్రంలో ఉదయం జరిగిన పండిట్ల పరీక్షలో కాసింత గందరగోళం నెలకొంది. ఉర్దూ మీడియం సోషియల్ అభ్యర్థులకు సోషియల్ కాకుండా గణితం ప్రశ్నపత్రాలు ఇచ్చారు. కాసేపటికి గమనించిన అభ్యర్థులు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో వాదనకు దిగారు.

ఇంతలో సమాచారం అందుకున్న డీఈఓ అంజయ్య అక్కడికి ఆఘమేఘాల మీద చేరుకున్నారు. అభ్యర్థులతో మాట్లాడారు. సోషియల్ ప్రశ్నపత్రాలు కల్గిన బండిల్ పక్కనే ఉంది. నిర్వాహకులు వాటిని గమనించక గణితం పేపర్లు ఇచ్చారని గుర్తించారు. వెంటనే వారికి సోషియల్ ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

 నేడు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు...
 డీఎస్సీ పరీక్షల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్కూల్ అసిస్టెంట్ సబెక్టులకు పరీక్షలు జరగనున్నాయి.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్) పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 3699 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం  16 కేంద్రృలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వెజస్) పరీక్ష జరగనుంది. 18,071 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

డీఈఓ అంజయ్య మాట్లాడుతూ మధ్యాహ్నం జరిగే నాన్ లాంగ్వేజస్ పరీక్షకు నగరంతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలన్నీ నగరానికి దూరంగా ఉంటాయని, అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం ఒంటిగంటకే కేంద్రానికి చేరుకునేలా చూడాలన్నారు. 3 గంటల తర్వాత నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు