వైఎస్‌ వివేకా పేరిట నకిలీ దరఖాస్తు

3 Mar, 2019 05:11 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటు తొలగించమని తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన నకిలీ దరఖాస్తు

ఓటుని తొలగించాలంటూ తహశీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో వినతి 

పులివెందుల: రాబోయే ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసైనా అధికారంలోకి రావాలన్న తపనతో టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను దొంగ సర్వేల ద్వారా గుర్తించి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది. సర్వేల ద్వారా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గుర్తించి ఆన్‌లైన్‌ ద్వారా ఓటర్లకు ఎటువంటి సంబంధం లేకుండా ఆగంతకులు ఓటరు పేరుతోనూ, వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యుల పేర్లతోనూ ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన ఓటును తొలగించాలని అభ్యర్థిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్‌ సోదరుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి పేరిట ఆన్‌లైన్‌లో తహశీల్దార్‌ కార్యాలయానికి శనివారం దరఖాస్తు పంపారు.

ఈ దరఖాస్తుపై వైఎస్‌ వివేకా సంతకం లేకపోవడం గమనార్హం. అలాగే వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 2,500కిపైగా ఓట్లను వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యుల పేరుతోనూ, ఓటర్ల పేరుతోనూ ఓట్లను తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో తహశీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తులు పంపారు. తమ పార్టీకి చెందిన నాయకుల పేర్లతో దరఖాస్తులు చేసిన వారిని అధికారులు గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు