దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో కోత

15 Dec, 2014 02:35 IST|Sakshi
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో కోత

* తగ్గనున్న 20 గ్రాములు
* ఈనెల 18  నుంచి అమలు

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డూ రూ. 10కి విక్రయిస్తుండగా, ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను ఇస్తామని  ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు  తగ్గిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి దేవస్థానానికి రూ. 11.40  ఖర్చు అవుతుండగా భక్తులకు రూ.10కే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డూపైన రూపాయి 40 పైసలను దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే రూ.10లకు సరిపోతుంది. దీనివల్ల దేవస్థానానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. సాధారణ రోజుల్లో రోజుకు 45 వేల నుంచి 50 వేల లడ్డూలు, శుక్ర, ఆదివారాల్లో 60 వేల నుంచి 75 వేల లడ్డూలు దేవస్థానం విక్రయిస్తోంది.

భవానీ దీక్షలు, దసరా ఉత్సవాల్లో రోజుకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి.  నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయింది.  ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్ అనూరాధకు తెలియపరచడంతో లడ్డూ సైజు తగ్గించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
లడ్డూ నాణ్యత పెంచాలి
ఈవో నర్సింగరావు వచ్చిన తరువాత పులిహోర నాణ్యత కొంతమేర మెరుగుపడింది. ఆయన లడ్డూపై దృష్టి సారించి నాణ్యత పెంచాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం పాలకమండలి అధికారంలో ఉన్న రోజుల్లో లడ్డూ ప్రసాదాలపై పూర్తిస్థాయి దృష్టిసారించి వాటి నాణ్యతను పెంచారు. ఆ తరువాత కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో నాణ్యత తగ్గిపోయింది. ఇప్పుడు సైజు కూడా తగ్గిస్తుండటంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. నష్టం వస్తోందని సైజు తగ్గించినా కనీసం నాణ్యతైనా పెంచాలని  కోరుతున్నారు.

మరిన్ని వార్తలు