-

సాగు.. సంపాదన పెంచేందుకు..

25 Aug, 2014 02:09 IST|Sakshi
సాగు.. సంపాదన పెంచేందుకు..
  •  రూ.85 కోట్లతో 8 చెరువుల అభివృద్ధికి ఉడా ప్రతిపాదనలు
  •   బోటింగ్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు
  •   నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి
  • సాక్షి, విజయవాడ : భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ అథారిటీ(వీజీ టీఎం ఉడా) అధికారులు మరో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఉడా అధికారులు ఇప్పటికే రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు.

    ఇందులో భాగంగానే ఉడా పరిధిలోని ఎనిమిది ప్రధాన చెరువులను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఆధునికీకరణ వల్ల చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం పెరుగుతందని ప్రతిపాదనల్లో వివరించారు. చెరువుల చుట్టూ ప్రహరీలు నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు, బోటింగ్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.85కోట్లు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరైతే ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు.
     
    కేంద్రం నిధులపై ఆశలు
     
    జిల్లాలోని బ్రహ్మయ్య లింగం చెరువును హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తరహాలో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.50కోట్లు మంజూరు చేయాలని ఉడా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జిల్లాలో మరో ఎనిమిది ప్రధాన సాగునీటి చెరువులను గుర్తించారు. వాటి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు ఇటీవల ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ ప్రాజెక్టుపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించడంతో కేంద్ర టూరిజం శాఖ నుంచి నిధులు మంజూరు చేయిస్తారని ఉడా అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
     
    అభివృద్ధి చేయనున్న చెరువులు ఇవే..
    విజయవాడ పాయకాపురంలోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువులో కొంతభాగం ఆక్రమణలకు గురైంది. దీని అభివృద్ధికి రూ.15కోట్ల అం చనాలతో ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
     
    గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంగానమ్మ చెరువును రూ.20కోట్లతో ఆధునికీకరించాలని నిర్ణయిచారు. తొలుత పూడిక తొలగిం చడం, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు.
     
    నున్న, గన్నవరం ప్రాంతాల మధ్య ఉన్న ఆరు చెరువులను ఒకే ప్యాకేజీ కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
     
    ముస్తాబాద గ్రామంలోని 306 ఎకరాల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
     
    నున్న సమీపంలో 106 ఎకరాల్లో ఉన్న పీత చెరువును, అదే ప్రాంతానికి చెందిన ధర్మ చెరువు, జంగంవాని చెరువు, పుల్లయ్య చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
     
    గన్నవరం మండలంలోని సూరంపల్లిలో సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రచెరువును కూడా అభివృద్ధి చేయటానికి ప్రతిపాదనలు తయారుచేశారు.
     

మరిన్ని వార్తలు