డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్‌ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా

25 Nov, 2023 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్‌ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్‌ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్‌పీ ఇండియా నిర్వహించిన గేమర్స్‌ ల్యాండ్‌స్కేప్‌ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్‌లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు.

విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్‌ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్‌ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది.
 
గేమ్‌లను సీరియస్‌గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. 

2022తో పోలిస్తే 2023లో గేమింగ్‌పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్‌ గేమర్లు (గేమింగ్‌ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు.  

67 శాతం మంది మొబైల్‌ ఫోన్‌ కంటే కంప్యూటర్‌లోనే గేమ్‌ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

స్పాన్సర్‌షిప్, ఈ స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి.  

గేమింగ్‌ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్‌ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు.  

అదే సమయంలో గేమింగ్‌ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. 

గేమింగ్‌ కెరీర్‌లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది.  

‘‘భారత్‌ ప్రపంచంలో టాప్‌–3 పీసీ (కంప్యూటర్‌) గేమింగ్‌ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్‌ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ ఎండీ ఇప్సితాదాస్‌ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్‌ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ పర్సనల్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు