పోస్టల్‌ బ్యాలెట్‌ అవకతవకలను సరిదిద్దండి

8 May, 2019 18:55 IST|Sakshi
సచివాలయంలో ద్వివేదిని కలసి వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ఎన్నికల ప్రధాన అధికారిని కోరిన వైఎస్సార్‌సీపీ

అనంతపురం కలెక్టర్‌ను నివేదిక కోరిన ద్వివేది

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో అవకతవకలను తక్షణం సరిదిద్దాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైఎస్సార్‌సీపీ కోరింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు రెండేసి పోస్టల్‌ బ్యాలెట్లను ఇచ్చారని తెలిపింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి బుధవారం సచివాలయంలో ద్వివేదిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా పోస్టల్‌ బ్యాలెట్లు ఇవ్వకపోతే మరికొన్నిచోట్ల ఒకటి కంటే ఎక్కువ పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారని, ఇలాంటి అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండేసి పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారంటూ తిప్పేస్వామి ఆధారాలను సమర్పించారు. దీనిపై రిటర్నింగ్‌ అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ద్వివేది ఈ అంశంపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాల్సిందే: ఉద్యోగుల సమాఖ్య
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ వెంకట రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. చివరి క్షణంలో ఎన్నికల బాధ్యతలు చేపట్టిన 40 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు