విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

1 Aug, 2016 22:17 IST|Sakshi
విద్యాసంస్థల బంద్‌ విజయవంతం
ఏలూరు సిటీ : విద్యార్థి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించాయి. జిల్లాలో 1,200కు పైగా ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలు, 400కు పైగా కళాశాలలు సోమవారం తెరుచుకోలేదు. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు మూసివేయించి బంద్‌ పాటించారు.  పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ ఇలా అన్ని విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి.

రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా, అణచివేత దోరణితో వ్యవహరిస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. జిల్లాలోని ఎనిమిది ముఖ్య పట్టణాల్లో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ సంఘాలు సంయుక్తంగా బంద్‌లో పాల్గొన్నాయి. ఇక మిగిలిన మండలాల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బంద్‌ సంపూర్ణంగా నిర్వహించారు. కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యేను విద్యార్థులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘెరావ్‌ చేశారు. బంద్‌ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్పొరేట్‌ విద్యావ్యాపారుల అనుకూల వైఖరి విడనాడకుంటే ఐక్యపోరాటాలు ద్వారా గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు కాకి నాని, పి.శివ, ప్రవీణ్, హేమంత్, ఇబ్రహీం, అజయ్, అరుణ్, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు