చీకట్లో ‘సిక్కోలు’!

12 Oct, 2018 03:58 IST|Sakshi

తుపాను ధాటికి జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నం

భారీగా కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలు, పలు సబ్‌స్టేషన్లు బ్రేక్‌

4,319 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

కొన్ని ప్రాంతాలకు పాక్షికంగా పునరుద్ధరణ

పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరికొన్నిరోజులు!

ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తున్న ఈపీడీసీఎల్‌

నష్టం రూ.20–25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా  

శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/అరసవల్లి(శ్రీకాకుళం): టిట్లీ తుపాను సిక్కోలు జిల్లాను అంధకారంలోకి నెట్టేసింది. గంటకు 100 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వేల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల సంఖ్యలో కనెక్షన్లు తెగిపోయాయి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ దెబ్బతినడంతో వందలాది గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఈపీడీసీఎల్‌ వర్గాల సమాచారం ప్రకారమే 4,319 గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.  

పాక్షికంగా పునరుద్ధరణ..
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) వర్గాల సమాచారం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల వరకు 2,160 గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించగలిగారు. 101 సబ్‌స్టేషన్లు దెబ్బతినగా 38 స్టేషన్లు, 11 కేవీ సబ్‌స్టేషన్లు 350కిగాను 93 సబ్‌స్టేషన్లను సరిచేశారు. 33 కేవీ స్తంభాలు 58, ఎల్‌టీ స్తంభాలు 2,036, 11 కేవీ స్తంభాలు 1,055 దెబ్బతిన్నాయి. కాగా, 33 కేవీ ఫీడర్లు 50 దెబ్బతినగా 22 ఫీడర్లను, 33 కేవీ ఫీడర్లు 380కిగాను 27 సరిచేశారు. జిల్లావ్యాప్తంగా 7,76,706 విద్యుత్‌ కనెక్షన్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇందులో గురువారం రాత్రికి కేవలం 6,200 కనెక్షన్లకు మాత్రమే సరఫరాను పునరుద్ధరించగలిగారు.

జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి, సోంపేట, నర్సన్నపేట, ఇచ్ఛాపురం పట్టణాలు బాగా ఎఫెక్ట్‌ అయ్యాయి. గురువారం రాత్రికి శ్రీకాకుళంలో విద్యుత్‌ను పునరుద్ధరించగా నర్సన్నపేటలో శుక్రవారం నాటికి ఇవ్వనున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి పట్టణాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో చిన్నాభిన్నమైన విద్యుత్‌ వ్యవస్థను సరిచేసేందుకు ఈపీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన 111 బృందాలను వినియోగిస్తున్నారు.

872 మంది కార్మికులు, 51 మంది ఏఈలు, 60 మంది ఏడీఈలు, డీఈలను నియమించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని విజయవాడ నుంచి మరో పదిమంది ఏఈలు, 200 మంది లేబర్‌ను శ్రీకాకుళం జిల్లాకు పంపుతున్నారు. టిట్లీ తుపాను వల్ల ఈపీడీసీఎల్‌కు ఎంత నష్టం వాటిల్లిందో లెక్క తేల్చే పనిలో అధికారులున్నారు. అనధికార సమాచారం ప్రకారం రూ. 25 కోట్లకుపైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోపరిస్థితిని సమీక్షించడానికి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ గురువారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు.

టెక్కలి డివిజన్‌ను పరిశీలించిన హెచ్‌వై దొర
ఇదిలా ఉండగా, టిట్లీ తుపాను వల్ల విద్యుత్‌ నష్టాల్ని అంచనా వేసేందుకు విశాఖపట్నం కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర నేతృత్వంలోని అధికారుల బృందం టెక్కలి డివిజన్‌లో పరిశీలించింది. అయితే టెక్కలి సమీపంలో రోడ్డు దెబ్బతినడం వల్ల దొర వెనుదిరిగి జిల్లా కేంద్రంలోనే మకాం వేసి నష్టాలపై సమీక్షించారు.  

మరిన్ని వార్తలు