రూ.700 కోట్లతో ఉపాధి పనులు

8 Apr, 2018 11:02 IST|Sakshi

వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉండాలి

గ్రామాల్లో వలసలు నివారించండి

కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశం

ఒంగోలు టౌన్‌:  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల  విలువైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు. ఉపాధి పనులకు ఏప్రిల్‌ నుంచి జులై వరకు ఎంతో కీలకమైనందున వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉండి విరివిగా పనులు కల్పించి వలసలు నివారించాలని సూచించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై డ్వామా, లైన్‌ డిపార్ట్‌మెంట్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016–2017 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పనుల కింద రూ.601 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 2018–2019 ఆర్ధిక సంవత్సరంలో రూ.700 కోట్లతో చేపట్టనున్న పనుల్లో, రూ.400 కోట్లు వేజ్‌ కాంపోనెంట్‌ కింద, రూ.300 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు పెట్టాలన్నారు. 

ఎక్కువ శాతం కూలీలు హాజరయ్యేలా చూడాలి: 
జిల్లాలో నెలకొన్న కరువును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ శాతం వేతన కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యేలా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఏపీఓలు పర్యవేక్షిస్తూ ఉండాలని వినయ్‌చంద్‌ సూచించారు. నీరు–ప్రగతి ఉద్య మం, ఎవెన్యూ ప్లాంటేషన్, చెరువు కట్టల బలో పేతం, ఫీడర్‌ కెనాల్స్‌ పనులు, చెరువుల్లో పూడికతీత పనులు, స్ట్రెంచస్, పంట కుంటల పనులు ఉపాధి హామీలో చేపట్టాలని సూచిం చారు. 2017–2018 ఆర్థిక సంవత్సరంలో 83 వేల కుటుంబాలకు 100 రోజులు పని కల్పిం చారని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో లక్షా 75 వేల కుటుంబాలకు 100 రోజులు పని కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సగటున రోజుకు రూ.190 నుంచి రూ.202 వరకు వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

పనులు జూన్‌ నాటికి పూర్తి చేయాలి: 
జిల్లాలో 2016–2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఉపాధి పనులను జూన్‌ నాటికి పూర్తి చేయాలని వినయ్‌చంద్‌ ఆదేశించారు. 2017–2018 సంవత్సరంలో అసంపూర్తి పనులను సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలన్నారు. ఉపాధి పనులను జియోట్యాగింగ్‌ చేయాలన్నారు. వర్క్‌షాపులో డ్వామా పీడీ పోలప్ప, జెడ్పీ సీఈఓ కైలాస్‌ గిరీశ్వర్, డీపీఓ ప్రసాద్, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు