ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది: ఎర్రబెల్లి

17 Sep, 2019 14:13 IST|Sakshi
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి) : బోటు ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలను వెలికితీయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ అక్కడే ఉండి పరిస్థితులను గమనిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గోదావరి అడుగున 315 అడుగుల లోతులో గుర్తించిన లాంచీని ఆధునాతన పరికరాల ద్వారా వెలికితీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. అయితే  లాంచీని బయటకు తీయడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని,  దీనికోసం ఇతర రాష్ట్రాలనుంచి నైపుణ్యాలను ఏపీ ప్రభుత్వం రప్పిస్తోందని పేర్కొన్నారు.  

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గంటగంట​కు సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గత రెండు రోజులుగా తాము సంఘటన ప్రదేశంలోనే ఉండి ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణకు చెందిన మృతదేహాలను వారి స్వస్థలానికి పంపించేందుకు అంబులెన్సులు సిద్దంగా ఉన్నాయని, వాటిని వారి ఇళ్లకు పంపేవరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. జరిగిన దుర్ఘటన చాలా బాధకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. లాంచీ కింద భాగంలో కూడా మృతదేహాలు ఇరుక్కుపోయి ఉంటాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు