వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు

26 May, 2020 05:09 IST|Sakshi

అన్నదాతల ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర, జిల్లా, మండల 

స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఉద్దేశాలు ఏమిటంటే.. 

► మార్కెట్‌ ఇంటెలిజెన్స్, వ్యవసాయ– వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటల వైవిధ్యంపై ఈ బోర్డులు చేసే సిఫార్సులను హార్టికల్చర్, సెరికల్చర్‌ సహా వ్యవసాయ విభాగాలన్నీ స్వీకరిస్తాయి.  
► పంట మార్పిడికి వెళ్లే పక్షంలో ప్రభుత్వం కల్పించాల్సిన మద్దతు ఎలా ఉండాలనే దానిపై ప్రతిపాదనలు చేయొచ్చు. 
► రైతుల నికర ఆదాయాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు ఎలా ఉండాలో వ్యవసాయ, అనుబంధ విభాగాలకు దిశానిర్దేశం చేయొచ్చు. 
► నీటివనరుల ఉత్తమ వినియోగ, యాజమాన్య పద్ధతులను సూచించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై సలహాలు ఇవ్వొచ్చు.  
► వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ, పంపిణీ సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటి నివారణకు పరిష్కార మార్గాలను కనిపెట్టాలి. 

రాష్ట్ర స్థాయి బోర్డు విధులు
► రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయడం 
► జిల్లా వ్యవసాయ ప్రణాళికలను ఆమోదించడం 
► జిల్లా వ్యవసాయ ప్రణాళికల తయారీ, అమల్లో జిల్లాలకు మార్గనిర్దేశం చేయడం 
► ఎగుమతులను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలతో సమన్వయం 
► రాష్ట్ర స్థాయిలో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం, జిల్లాల్లో మార్కెట్‌ ఆధారిత పంట పద్ధతిని అనుసరించాలని ఆయా జిల్లాలకు సూచించడం 
► రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ విధాన నిర్ణయ వ్యవస్థను పటిష్టం చేయడం 
► పంటకోత అనంతర కార్యకలాపాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక తయారీ 
► ఇ–క్రాప్‌ బుకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం 
► వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత, నియంత్రణ వ్యవస్థలను పటిష్టం చేయడం 
► ఆయా అంశాలపై నిపుణులతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నుంచి సలహాలను స్వీకరించడం 

జిల్లా స్థాయి బోర్డుల విధులు.. 
► మండలస్థాయి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడానికి జిల్లా వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయడం. 
► మండల వ్యవసాయ ప్రణాళికల ఆమోదం 
► జిల్లా వ్యవసాయ ప్రణాళికల తయారీ, అమలులో మండలాలకు మార్గనిర్దేశం చేయడం 
► అన్నదాతల శ్రేయస్సు కోసం జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడం 
► రైతు భరోసా కేంద్రాలు సరిగా పని చేసేలా చూడడం 
► జిల్లా స్థాయిలో ఇ–క్రాప్‌ బుకింగ్‌ వ్యవస్థ పర్యవేక్షణ 
► మండల స్థాయి బోర్డులు మండల స్థాయిలో దాదాపు పై విధులే నిర్వహిస్తాయి.  

బోర్డుల నియామకం.. 
రాష్ట్ర స్థాయి బోర్డు: దీనికి వ్యవసాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా, ఆ శాఖ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా వ్యవసాయం, మార్కెటింగ్, హార్టికల్చర్‌ శాఖల ఉన్నతాధికారులు, అగ్రి, ఉద్యాన వర్సిటీలు, పరిశోధన కేంద్రాలు, ఏపీ ఆగ్రోస్, మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్, పలు రంగాల ప్రతినిధులు, 10 మంది రైతులు ఉంటారు. 

జిల్లా స్థాయి బోర్డు: జిల్లా మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, రైతు భరోసా, రెవెన్యూ వ్యవహారాలు చూసే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, మార్కెటింగ్‌ శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, కేవీకేలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ప్రిన్సిపల్‌ సైంటిస్టులు, తదితరులతోపాటు పది మంది అభ్యుదయ రైతులు ఉంటారు.  

మండల స్థాయి బోర్డు: ఎమ్మెల్యే చైర్మన్‌గా, మం డల పరిషత్‌ అధ్యక్షుడు వైస్‌ చైర్మన్‌గా, మండల వ్యవసాయాధికారి మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటా రు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో, హార్టికల్చర్, సెరికల్చర్‌ అధికారులు, తదితరులతోపాటు ఐదుగురు అభ్యుదయ రైతులు ఉంటారు.  

మరిన్ని వార్తలు