ప్రతి రోడ్డూ డంపింగ్ యార్డే!

12 Jan, 2014 03:12 IST|Sakshi
సాక్షి, రాజమండ్రి : ‘చెత్తపై కొత్త సమరం’- పురపాలక శాఖ చేపట్టిన నూరు రోజుల కార్యక్రమం నినాదమిది. దీన్ని వినగానే ‘వీధులు ఇక తుడిచిన అద్దాల్లా తయారవుతాయి’ అని రాజమండ్రి ప్రజలు ఆశించారు. అయితే ఆ ఆశ అడియాస కావడమే కాక.. గతంలో చెత్త కుండీలతో పాటు అక్కడక్కడా కనిపించే చెత్త ఇప్పుడు ‘అందుగలదు ఇందులేదు’ అని సందేహించనక్కర లేకుండా ప్రతి రోడ్డుపైనా దర్శనమిస్తోంది. ఉదయం ఏడు నుంచి 9 గంటల మధ్య రోడ్లపైకి వస్తే.. ముక్కు మూసుకోవలసిందే. చెత్తను తరలిస్తూ దూసుకుపోయే వాహనాలను చూసి, ‘పులిని చూసిన లేళ్ల లా’ చెంగున గెంతాల్సిందే. కారణం-ఆ ట్రక్కుల నుంచి వెలువడే దుర్గంధం, జారి పడే నానారకాల వ్యర్థాలే.
 
 చెత్తలేని నగరాలుగా తీర్చిది ద్దేందుకు సుమారు 45 రోజుల క్రి తం పురపాలక శాఖ ‘చెత్తపై కొత్త స మరం’ అంటూ వందరోజుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. పట్టణా లు, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. రాజమండ్రి లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి మ ల్లయ్యపేట సమీపంలోని డంపింగ్‌యార్డుకు తరలించే చెత్తలో కొంత రోడ్లపై జారిపడిపోతోంది. ఆ సమయంలో ఆ వాహనాలకు దగ్గరగా ఉన్నవారికి చెత్తాభిషేకం తప్పదు. రాజమండ్రిలో ఏడు టిప్పర్లు, 12 ట్రాక్టర్లు, మరో ఏడు చిన్నవాహనాలపై రోజుకి సుమారు 250 టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. వీటిలో టిప్పర్లకు, సగానికి పైగా ట్రాక్టర్లకు వెనకాల తలుపులే లేవు. దీంతో వాటి నుంచి చెత్త రోడ్ల మీద జారిపడిపోతోంది. దీంతో వీధులు ఖరాబు కావడమే కాక.. రోడ్లపై సంచరించే వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రాతఃకాలంలోనే లేచి ఎక్కడికైనా వెళ్లేవారికి ఈ వాహనాలు దుశ్శకునాలుగా పరిణమించాయి.
 
 ఇం‘ధనం’ వృథా
 చెత్త రవాణాకు వాహనాలకు తలుపులు లేకపోవడంతో వాటి సామర్థ్యంలో సగం మాత్రమే చెత్తను వేస్తున్నారు. దీంతో ఓ వాహనంలో లోడు వేయగల చెత్తలో 50 నుంచి 60 శాతం మాత్రమే లోడు చేయగలుగుతున్నా రు. రెండు ట్రిప్పుల్లో తరలించాల్సిన చెత్తకు మూడు, నాలుగు ట్రిప్పులు తిరగాల్సి వస్తోంది. మరి, నగర పాలక సంస్థ అధికారులు ఇకనైనా ‘చెత్తపై కొత్త సమరాన్ని’.. ప్రజలకు మరింత అసౌకర్యం కలిగించేలా కాక నగరాన్ని నిజంగానే నీటుగా ఉంచేలా, నగర ప్రజల ముఖాన చెత్తెత్తి పోయకుండా సజావుగా సాగిస్తారా?
 
>
మరిన్ని వార్తలు