యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు 

4 Dec, 2023 05:26 IST|Sakshi

తుపాను ముప్పుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం 

ఆఫ్‌లైన్‌లో ధాన్యం సేకరణ.. వెంటనే మిల్లులకు తరలింపు 

7 జిల్లాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు చర్యలు 

తేమ శాతం అధికంగా ఉన్నా కొనుగోలుకు ఆదేశాలు 

ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 4.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు 

సాక్షి, అమరావతి: ‘మిచాంగ్‌’ తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను శరవేగంగా కొనుగోలు చేయనుంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులు ఆన్‌లైన్‌ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది.

తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది.  

గంటల్లోనే సేకరణ 
తుపాను ముప్పు పొంచి ఉండటంతో వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ను తప్పించి, ఆఫ్‌లైన్‌లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు ఆఫ్‌లైన్‌ సేకరణకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలించనుంది.

తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సైతం సేకరించి డ్రయర్‌ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనుంది. సదరు జిల్లాల్లోని మిల్లుల్లో డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు పంపించనుంది. అందుకయ్యే అదనపు రవాణా ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించనుంది. అయితే.. నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్‌ సౌకర్యం మిల్లులున్నాయి.

క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి డ్రయర్‌ మిల్లులకు తరలించేలోగా వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్‌ చేయనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్‌ దశల్లో ఉంది. రానున్న 24–36 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. 

ఇప్పటివరకు 4.66 లక్షల టన్నుల సేకరణ 
ఇప్పటివరకు 67,837 మంది రైతుల నుంచి రూ.1,017.77 కోట్ల విలువైన 4.66 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రవాణా, కూలి, గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. దీంతో రైతులెవరూ ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించట్లేదు. దీనిని గమనించిన వ్యాపారులు తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు 
రైతులెవరూ అధైర్యపడొద్దు. వీలైనంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్‌ చేసి ట్రాక్‌ïÙట్‌ జనరేట్‌ చేసిన తర్వాత సమీపంలోని మిల్లులకు తరలించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సోమవారం నాటికి అందుబాటులోని మొత్తం ధాన్యం సేకరించేలా సమాయత్తం అవుతున్నాం. ఆలస్యమైతే వర్షాలు కురిసి ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఎఫ్‌టీవోలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుంది. ఎవరూ కూడా మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదు.   – హెచ్‌.అరుణ్‌కుమార్,  కమిషనర్, పౌరసరఫరాల శాఖ 

రోడ్లపై ధాన్యాన్ని వదిలేయొద్దు 
ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరూ కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దు. వెంటనే ఆర్బీకేలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలి. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ  

>
మరిన్ని వార్తలు