ఓటు హక్కు వినియోగించుకోవాలి

7 Mar, 2019 18:21 IST|Sakshi
ఈవీఎంపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌

సాక్షి, మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటుగా ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన కార్యక్రమం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో మౌలిక సదుపాయాలు సాధించుకోవడంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువ ఉందన్నారు. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేని పక్షంలో నోటా వినియోగించుకోవచ్చునని చెప్పారు.


క్రిమినల్‌ చరిత్ర తెలియజేయాల్సిందే...
తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా అఫిడవిట్‌లో పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసిందని ఇంతియాజ్‌ తెలిపారు.


బాహుబలిలా....
ఎన్నికల ఓటింగ్‌ యంత్రాల అవగాహనలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్‌ విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి బాహుబలి సినిమాతో పాటుగా మిసిసిపి మషాలా అనే ఇంగ్లిష్‌ సినిమాలోని అంశాలను ప్రస్తావించారు. కెన్యాలోని ఒక నియంత నాయకుడు అయితే ఆ పాలన ఎలా సాగుతుందోననే అంశాలతో మిసిసిపి మషాలా సినిమాలో చూపించారని అప్పుడు ఓటు విలువ తనకు తెలిసిందని చెప్పారు.


మొదటి సారిగా వివి ప్యాట్‌ల వినియోగం
ఓటర్‌ వెరిఫేబుల్‌ పేపర్‌ ఆడిట్‌ వేర్‌ (వీవీ ప్యాట్‌)ను మన రాష్ట్రంలో మొదటి సారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని, ఈవీఎంలో ఓటరు ఎవరికి ఓటు వేశారో ఈ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటరుకు కనిపిస్తోందని చెప్పారు.


ఫారం–7 కింద 25 కేసులు నమోదు చేశాం..
జిల్లా పరిధిలో ఒకరి పేరుతో ఉన్న ఓటును తొలగించమని కొంత మంది ఫారం–7 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఈ విధంగా దరఖాస్తు ఎవరు చేశారనే విషయంపై విచారణ జరుగుతుంది. తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై జిల్లాలో 25 కేసులు నమోదు చేశాం. విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామని సదస్సు అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సదస్సులో తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.గురుప్రకాష్, తహసీల్దార్‌ లలిత, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌ పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను కలెక్టర్‌ పరిశీలించారు.  

మరిన్ని వార్తలు