'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!? | Sakshi
Sakshi News home page

'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?

Published Sun, Nov 19 2023 1:48 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్‌ బాక్స్‌ మొదలు ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌) వరకు ఓటింగ్‌ విధానంలో మార్పులు తెచ్చింది. ఈవీఎం, వీవీప్యాట్‌, నోటా లాంటి నూతన విధానాలతో పారదర్శక ఓటింగ్‌కు భరోసానిస్తోంది. 1999 ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ కోసం ఈవీఎం వాడడంతో 10 వేల టన్నుల కాగితం మిగిలింది. ఈవీఎంలను మొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పర్వూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలకు నివృత్తిగా పలు సమాధానాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం విశేషాలపై కథనం..

ఈవీఎం అంటే?
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌. ఇది ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రికార్డు చేయడంతో పాటు లెక్కించే పరికరం. ఈవీఎంలో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌తో పాటు జతగా వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) ఉంటుంది.

రవాణా సులభం..
బ్యాలెట్‌ బాక్సులతో పోలిస్తే ఈవీఎంల రవాణ చాలా సులభం. తేలికంగా, పోర్టబుల్‌గా ఉండడంతో దూరంగా, రోడ్డు సౌకర్యం లేనిప్రాంతాలకు సైతం వీటిని సులభంగా తరలించవచ్చు.

గరిష్టంగా అభ్యర్థుల సంఖ్య, వేసే ఓట్లు..
ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో పాటు 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఒకవే ళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే మ రో బ్యాలెట్‌ యూనిట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఒక ఈవీఎంకు 24 బ్యాలెట్‌ యూని ట్లు అనుసంధానించవచ్చు. తద్వారా 384 మంది అభ్యర్థుల వరకు సేవలు అందిస్తుంది. ఇక ఓట్ల విషయానికి వస్తే గరిష్టంగా 2 వేల ఓట్లను రికార్డు చేస్తుంది. కానీ ఎన్నికల్లో సాధారణంగా 1500 ఓట్లను నమోదు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.

విద్యుత్‌ లేని ప్రాంతాల్లో..
ఈవీఎంలకు విద్యుత్‌ సరఫరా అవసరం లేదు. ఈవీఎం, వీవీప్యాట్‌లకు సొంతంగా బ్యాటరీ/పవర్‌–ప్యాక్‌ సౌకర్యం ఉండడంతో విద్యుత్‌ సరఫరా లేని ప్రాంతాల్లో సైతం వీటిని వినియోగించవచ్చు.

నిర్ధారించుకున్న తర్వాతే పోలింగ్‌..
పోలింగ్‌ ప్రారంభానికి ముందు కంట్రోల్‌ యూనిట్‌లో రిజల్ట్‌ బటన్‌ను నొక్కి ఇప్పటికే ‘దాచిన’ ఓట్లేవీ నమోదు కాలేదని ప్రిసైడింగ్‌ అధికారి హాజరైన పో లింగ్‌ ఏజెంట్లకు ప్రదర్శిస్తారు. వీవీప్యాట్‌ డ్రాప్‌బా క్స్‌ తెరిచి ఖాళీగా ఉందని చూపుతారు. వారి సమక్షంలో కనీసం 50 ఓట్లతో మాక్‌ పోల్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ ఫలితాన్ని క్లియర్‌ చేసి అసలు పోల్‌ ప్రారంభించే ముందు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌కు సీలు వేస్తారు.

పోలైన ఓట్ల సంఖ్య ఇలా తెలుసుకోవచ్చు..
ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌లో ఫలితం బటన్‌తో పాటు, టోటల్‌ బటన్‌ ఉంటుంది. పోల్‌ సమయంలో ఎప్పుడైనా ఈ బటన్‌ నొక్కితే అప్పటి వరకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తుంది. పోలింగ్‌ ముగియగానే క్లోజ్‌ బటన్‌ నొక్కితే మెషిన్‌ ఇకపై ఓట్లను అంగీకరించదు.

ఈవీఎంల భద్రత..
పోలింగ్‌ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లో సె క్యూరిటీ బలగాల పహారాలో భద్రపరుస్తారు. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లు కౌంటింగ్‌ వరకు ఈవీఎంలను 24 గంటలూ చూసేందుకు అనుమతిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తాళాలు వేసి ఎన్నికల అధికారులతో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సంతకాలతో సీలు వేస్తారు.

కౌంటింగ్‌ డే..
కౌంటింగ్‌ రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ తెరుస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత, వీవీప్యాట్‌ స్లిప్‌లను బయటకు తీసి, అభ్యర్థులు/వారి ప్రతినిధుల సమక్షంలో నల్లటి కవరులో భద్రపరుస్తారు.

ఓటరు ఫిర్యాదు చేయవచ్చు..
ఓటరు ఓటును నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే పేపర్‌ స్లిప్‌లో ఓటు వేసిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి పేరు, గుర్తు వచ్చినట్లయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నిజమని తేలితే ఆ ఓటింగ్‌ యంత్రంలో తరువాతి ఓట్ల నమోదును నిలిపివేసి రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు.

ఓటు ఎలా వేయవచ్చు?
ఈవీఎం ఓటింగ్‌ విధానంలో కంట్రోల్‌ యూ నిట్‌ ప్రిసైడింగ్‌ అధికారి వద్ద, బ్యాలెట్‌ యూ నిట్‌, వీవీప్యాట్‌ ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై ఓటరు తన కు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూబటన్‌ నొక్కగానే ఎరుపురంగు లైట్‌ మె రుస్తుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థి సీరియ ల్‌ నంబర్‌, పేరు, గుర్తు చూపించే పేపర్‌ స్లిప్‌ వీవీప్యాట్‌ విండో ద్వారా సుమారు 7 సెకన్ల పాటు కనిపించి డ్రాప్‌బాక్స్‌లో పడగానే కొద్దిసేపు బీప్‌ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు నమోదైందని తెలుసుకోవచ్చు.

ఈవీఎం మొరాయిస్తే..
పోలింగ్‌ సమయంలో బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్‌ క్రమం తప్పితే బ్యాలట్‌, కంట్రోల్‌ యూనిట్‌తో పాటు వీవీప్యాట్‌తో కూడిన కొత్త సెట్‌ ఏర్పాటు చేస్తారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో రిజర్వ్‌ దశ నుంచి పనిచేయని దశ వరకు నమోదైన ఓట్లు, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ బ్యాలెట్‌ స్లిప్‌లు కంపార్ట్‌మెంట్‌ మెమరీలో భద్రంగా ఉంటాయి. వీవీప్యాట్‌ మాత్రమే పనిచేయకపోతే కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన ఓట్లు దాని మెమరీలో భద్రంగా ఉంటాయి. దీంతో రిజర్వ్‌ మెషిన్ల నుంచి పనిచేయని వీవీప్యాట్‌ తొలగించి మరొకటి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్‌ తిరిగి ప్రారంభిస్తారు. ఏదైనా సాంకేతిక కారణాలతో కంట్రోల్‌ యూనిట్‌లలో నమోదైన ఓట్లను నిర్ధారించకపోతే కంట్రోల్‌ యూనిట్‌ వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement