ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు!

13 Jan, 2015 02:40 IST|Sakshi
అర్ధాంతరంగా ఆగిపోయిన మన్నవరం ప్రాజెక్టు పనులు

జిల్లా పారిశ్రామిక ప్రగతిపై చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడంపై విమర్శలు అధికారం చేపట్టకముందే ప్రారంభమైన పరిశ్రమలను జపాన్ పర్యటనతో సాధించినట్లు చంద్రబాబు గొప్పలు న్యాయస్థానంలో వివాదంలో ఉన్న భూమిని కేటాయించడంపై హీరో మోటో కార్ప్ యాజమాన్యం కినుక డీఆర్‌డీవో లేబొరేటరీని ఒక్కోసారి ఒక్కో జిల్లాలో ఏర్పాటుకు భూములను పరిశీలిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి బృందం మన్నవరం ప్రాజెక్టు రెండో దశలో పెట్టుబడులు ఇప్పట్లో పెట్టలేమని ఎన్‌బీపీపీఎల్ తేల్చిచెప్పినా పట్టించుకోని సీఎం
 
 
 ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడమంటే ఇదే..! అధికారం చేపట్టక ముందే ప్రారంభమైన పరిశ్రమలను తాను జపాన్‌లో పర్యటించి సాధించినట్లు  చంద్రబాబు గొప్పలకు పోయారు. జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా మార్చుతానని ప్రకటించిన సీఎం.. ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం వివాదాస్పద  భూములు కేటాయించడంతో హీరో సంస్థ కినుక వహించినట్లు అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. శ్రీరంగరాజపురం మండలం కొక్కిరాలకొండలో ఏర్పాటుచేస్తామన్న   డీఆర్‌డీవో ల్యాబొరేటరీ ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో నెలకొల్పుతామంటూ ఆ సంస్థ ప్రతినిధి బృందం ప్రకటిస్తూ.. భూములను పరిశీలిస్తోంది. ఇదొక పార్శ్వమైతే..  మన్నవరం ప్రాజెక్టు రెండో దశ పనులను ఇప్పట్లో చేపట్టలేమని ఎన్‌బీపీపీఎల్ చేతులెత్తేసినా చంద్రబాబు నోరుమెదపడం లేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. తన ఏడు నెలల పాలనలో పారిశ్రామిక ప్రగతిలో జిల్లా దూసుకుపోతున్నట్లు డిసెంబర్ 10న తిరుపతిలో నిర్వహించిన సీఐఐ సదస్సులో  చంద్రబాబు గొప్పలు చెప్పడం గమనార్హం.
 
 
తిరుపతి:
 ఐదు మిషన్‌లు, ఏడు కార్యక్రమాలతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ.. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని అమలుచేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పసిగట్టిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను శ్రమిస్తున్నాననే భావన కలిగించి ప్రజల దృష్టి మరల్చేందుకు విదేశీ పర్యటనలకూ.. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకూ వెళ్తున్నారు. ఆ పర్యటనలతో భారీ ఎత్తున పరిశ్రమలను సాధిం చినట్లు.. వాటిలో అధికశాతం జిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఇది కనికట్టు కాదా..?

 
జిల్లాలో శ్రీసిటీ సెజ్‌లో రూ.1,500 కోట్ల వ్యయంతో ఇసుజు సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చిం దని.. కొబెల్కో క్రేన్స్ సంస్థ కూడా కర్మాగారాన్ని  నెలకొల్పేందుకు అంగీకరించిందని చం ద్రబాబు ప్రకటించారు. జపాన్ పర్యటనలో ఆ సంస్థల యాజమాన్యంతో చర్చించడం వల్లే ఆ పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని సెలవిచ్చారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు తాను సాధించాననని చెబుతోన్న పరిశ్రమల పనులు శ్రీసిటీ సెజ్‌లో ఇప్పటికే ప్రారంభం కావడం గమనార్హం.

శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ ప్రతినిధులు జనవరి 28, 2013న భూమి పూజ చేశారు. రూ.1,500 కోట్ల వ్యయంతో ఏడాదికి 1.20 లక్షల వాహనాల(80 దేశంలో విక్రయించేందుకు.. 40 వేల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు) తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటుచేయడానికి మార్చి 15, 2013న అప్పటి పరిశ్రమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఇసుజు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం శ్రీసిటీ సెజ్‌లో ఆ పరిశ్రమ పనులు సాగుతున్నాయి.

కొబెల్కో క్రేన్స్ పరిశ్రమ 2012లో శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటైంది. ఇప్పటికే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. శ్రీసిటీ సెజ్‌లో మరో పది ఎకరాలను కేటాయిస్తే పరిశ్రమను విస్తరిస్తామని 2013లో ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. కానీ.. భూకేటాయింపుల్లో జాప్యం చోటుచేసుకోవడంతో విస్తరణకు నోచుకోలేదు. ఇప్పుడు అదే ప్రతిపాదనను కొబెల్కో ప్రతినిధులు చేయడం గమనార్హం.

హీరో మోటో కార్‌‌ప సంస్థ జిల్లాలో రూ. 1600 కోట్లతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కానీ.. ఆ సంస్థకు సత్యవేడు మండలం మాదన్నపాళెంలో 600ఎకరాల వివాదాస్పద భూములను ప్రభుత్వం కేటాయించింది. సుప్రీంకోర్టులో ఆ భూములు వివాదంలో ఉండటాన్ని పసిగట్టిన హీరో యాజమాన్యం.. ఆ భూములను పరిశీలించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.

నోరుమెదపరెందుకు బాబూ

జిల్లాలో డీఆర్‌డీవో ల్యాబొరేటరీ ఏర్పాటుకు కలికిరి మండలం టేకులకోన, ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండ వద్ద భూమిని కేటాయించేందుకు 2010లోనే ప్రభుత్వం అంగీకరించింది. అప్పట్లో కుదిరిన ఎంవోయూ మేరకే డీఆర్డీవో ప్రయోగశాలకు ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండ వద్ద 1100 ఎకరాలను కేటాయిస్తూ ఆగస్టు 13న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

 ఠచిత్తూరు జిల్లాలో కొక్కిరాలకొండ వద్ద డీఆర్డీవో ప్రయోగశాలను ఏర్పాటుచేస్తున్నట్లు సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. కానీ.. ఇంతలోనే ఆ ప్రయోగశాలను వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కొప్పర్తి పారిశ్రామికవాడలో 2,500 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు కొప్పర్తి పారిశ్రామికవాడను డీఆర్డీవో బృందం పరిశీలించింది. పోనీ.. అక్కడితోనైనా ఆగారా అంటే అదీ లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కొలనుపాక వద్ద డీఆర్డీవో ప్రయోగశాల ఏర్పాటుకు నవంబర్ 28న ఆ సంస్థ ప్రతినిధులు భూమిని పరిశీలించారు. 2,500 ఎకరాల భూమిని కేటాయిస్తే రూ.468 కోట్ల వ్యయంతో ప్రయోగశాలను ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. చిత్తూరుజిల్లాలో డీఆర్డీవో ప్రయోగశాలకు భూమిని కేటాయించి.. ఇప్పుడేమో కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.

 దేశానికే తలమానికంగా నిలుస్తుందనుకున్న మన్నవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.  విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఏటా ఐదు వేల మెగావాట్లు పెంచేలా పరికరాలను తయారుచేసే లక్ష్యంతో ఎన్‌టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), బీహెచ్‌ఈల్(భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)లు సంయుక్తంగా రూ.ఆరు వేల కోట్ల వ్యయంతో మన్నవరంలో 2010లో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టులో తొలి దశలో రూ.1200 కోట్ల వ్యయంతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్‌పీ), వాటర్ సిస్టమ్‌ను తయారుచేయాలన్నది లక్ష్యం. ఈ పనులు 2012 నాటికే పూర్తికావాలి. కానీ.. ఇప్పటిదాకా తొలి దశ పనులు పూర్తికాలేదు. ఎల్ అండ్ టీ, భారత్ పోర్జ్, బీజీఆర్, తోషిబా వంటి సంస్థలు ఇప్పటికే బాయిలర్లు, జనరేటర్లు, టర్బై న్లును తయారుచేస్తుండటం.. విద్యుత్ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రూ.4,800 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన రెండో దశ పనులను ఇప్పట్లో చేపట్టలేమంటూ ఈనెల 8న ఆ సంస్థ ప్రకటించినా చంద్రబాబు నోరుమెదపడం లేదు. ఇదీ చంద్రబాబుకు జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి..!

మరిన్ని వార్తలు