మద్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక 

16 Jun, 2019 04:51 IST|Sakshi

నవరత్నాల్లో ఒకటైన దశలవారీ మద్యపాన నిషేధంపై నిత్యం కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షలు  

‘సాక్షి’తో ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ 

సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. మద్యనిషేధం భవిష్యత్‌ కార్యాచరణపై కమిషనర్‌ మాటల్లోనే.. 

కలెక్టర్లు, ఎస్పీలు నిత్యం సమీక్షలు జరపాలి 
నవరత్నాల అమలును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నవరత్నాల్లో ఒకటైన దశలవారీ మద్యపాన నిషేధం అంశాన్ని నిత్యం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించాలి. ఇందుకు గాను ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు మా వైపు నుంచి లేఖలు రాస్తున్నాం. మద్యం లైసెన్సీలతో సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వ విధానం స్పష్టంగా చెప్పాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని మా శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ డీసీలు, ఏసీలు కొన్ని సమస్యలు చెప్పారు. ఎక్సైజ్‌ స్టేషన్ల రీఆర్గనైజేషన్, నిధుల విడుదల వంటి కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం.  

ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నెంబరు  
మద్యం అక్రమ అమ్మకాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులపై ఫిర్యాదులు చేసేందుకు కమీషనరేట్‌లో టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాం. ప్రజలు 1800 425 4868 నెంబరుకు ఫిర్యాదులు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు మద్యపాన నియంత్రణకు సహకరించాలి. సమాచార శాఖను సంప్రదిస్తున్నాం. సినిమా హాళ్లలో మద్యపాన నియంత్రణపై ప్రచారం చేసేందుకు ఆలోచిస్తున్నాం. సినిమా హాళ్లలో స్లైడ్‌ల ద్వారా, గ్రామాల్లో కళాజాతల ద్వారా మద్యపాన నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. బెల్టు షాపుల్ని అరికట్టడం, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందిస్తాం.  

190 నాటుసారా తయారీ గ్రామాల్ని దత్తత 
రాష్ట్రంలో మొత్తం 190 గ్రామాల్లో నాటుసారా తయారీ సాంప్రదాయంగా వస్తోంది. ఈ గ్రామాల్లో నాటుసారాకు బానిసైన వారున్నారు. ‘జాగృతి’ అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ గ్రామాల్ని ఎక్సైజ్‌ శాఖ అధికారులు దత్తత తీసుకుంటారు. నాటుసారా తయారీ నుంచి అక్కడి ప్రజలు బయటపడేలా ప్రభుత్వ శాఖల సాయంతో ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తాం.  

డీ–అడిక్షన్‌ కేంద్రాలు 
మద్యం దురలవాటును తగ్గించడానికి డీ–అడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మద్యానికి బానిసైన వారిని ఆ కేంద్రాల్లో చేర్పిస్తాం. కేరళ, పంజాబ్‌లలోని కేంద్రాలను ఇప్పటికే పరిశీలించాం. అక్కడి తరహాలోనే డీ–అడిక్షన్‌ కేంద్రాలు నిర్వహించేందుకు ప్రణాళిక ఉంది.  

మరిన్ని వార్తలు