వీడని ఎక్సైజ్ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ

31 Jan, 2014 06:15 IST|Sakshi

 ఆదిలాబాద్ క్రైం/మంచిర్యాల అర్బన్/చెన్నూర్/మెట్‌పల్లి, న్యూస్‌లైన్ :
 ఆదిలాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాపర్తి గోపాల్(46) కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగా మారింది. బుధవారం విధులు ముగించుకుని ఆదిలాబాద్‌లోని తన నివాసానికి వెళ్తుండగా కారులో కిడ్నాప్ చేసిన తెలిసిందే. ఈ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. డెప్యూటీ కమిషనర్ శివరాజ్‌తోపాటు తోటి ఉద్యోగులు గతంలో గోపాల్‌తో పనిచేసిన రామ్మోహన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని జ్యోతినగర్‌లో ఉంటున్న ఎక్సైజ్ ఉద్యోగి రామ్మోహన్‌ను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
  గోపాల్‌ను హత్య చేసినట్లుగా చెబుతున్న సంఘటన స్థలానికి తీసుకెళ్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ముందుగా మామడ మండలం మేడిపల్లిలో హత్య చేశానని చెప్పి పోలీసులను అక్కడికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులోని మాల శ్మశాన వాటికలో కాలుతున్న శవంపై గోపాల్ మృతదేహాన్ని పడేశానని చెప్పాడు. దీంతో టూటౌన్ సీఐ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో చితి వద్ద కాలు, చేయి ఉందనే సమాచారంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. పూర్తిగా కాలకుండా ఉన్న కాలు, చేయిని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం ఆదిలాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, నిందితుడు చెప్పినట్లుగా కాలుతున్న శవంపై గోపాల్ మృతదేహాన్ని వేశాడా లేదా అనే కోణంలో పోలీసులు పరిశోధన చేస్తున్నారు. దీంతో గోపాల్ మృతిచెందినట్లుగా పోలీసులు ఇంకా నిర్దారణకు రాలేదు.
 
 గొడవలే కారణమా..
 ప్రస్తుతం గోదావరిఖనిలో పనిచేస్తున్న రామ్మోహన్ గతంలో ఆదిలాబాద్‌లో స్టెనోగా గోపాల్‌తోపాటు పనిచేశాడు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు మాయం కావడంతో వాటిని అప్పగించాలని గోపాల్ పలుమార్లు కోరాడు. ఐదు నెలల క్రితం అప్పటి ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ అతడిని కరీంనగర్‌కు బదిలీ చేశాడు. రామ్మోహన్ సరిగా పనిచేయడం లేదని కమిషనర్‌తో సహోద్యోగులు తన గురించి చెప్పారని కక్ష పెంచుకుని ఉంటాడని ఉద్యోగులు చెబుతున్నారు. రామ్మోహన్‌కు నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని, వాటి విషయంలో కూడా గోపాల్‌తో విబేధాలు వచ్చాయని ఈ క్రమంలో కక్ష పెంచుకుని అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. రామ్మోహన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా మేడిపల్లి, కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్‌లోని గోదావరిలో, ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామాల్లో గాలించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మెట్‌పల్లిలోనూ విచారణ జరిపారు. అక్కడ దొరికిన అవయవాలు గోపాల్‌వేనా కాదా అనేది తేలాల్సి ఉంది. గోపాల్‌ను చంపాడా.. లేక ఎక్కడైనా దాచాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 మంచిర్యాలలో విషాదం
 గోపాల్ మిస్టరీతో మంచిర్యాలలోని అతడి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గోపాల్‌కు తల్లి కిష్టాబాయి, భార్య జయ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. స్వస్థలం చెన్నూర్ కాగా ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా మంచిర్యాల, బెల్లంపల్లి సీఐ కార్యాలయాల్లో పనిచేశాడు. రెండేళ్ల క్రితం సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి లభించింది. ఆదిలాబాద్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ డెప్యూటేషన్‌పై మంచిర్యాలలో విధులు నిర్వర్తించాడు. జూలైలో డెప్యూటేషన్ రద్దు కావడంతో ఆదిలాబాద్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆదిలాబాద్‌లోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో ఒక్కడే ఉంటున్నాడు. భార్యాపిల్లలు మంచిర్యాలలో ఉంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు