విస్తరణా? ప్రక్షాళనా?

21 Sep, 2016 03:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ముహుర్తం దాదాపు ఖరారైంది. మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని వినిపిస్తున్నా... పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారని పార్టీవర్గాలంటున్నాయి. అక్టోబర్ ఒకటి లేదా తొమ్మిదిన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులుంటాయని టీడీపీ వర్గాలు, అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో తన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కరికే చోటు కల్పిస్తారని కొందరంటుంటే, అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర కేబినెట్‌లో  26 మందికి చోటు కల్పించవచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలో 20 మంది మాత్రమే ఉన్నారు. మరో ఆరుగురు కొత్త వారికి అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలోని కనీసం అరడజను మందిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే కొత్తగా డజను మందికి  స్థానం కల్పించవచ్చు.
 
భారీ సంఖ్యలో ఆశావహులు...
కొద్ది రోజులుగా లోకేష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి ప్రాధాన్యతను త గ్గించే అవకాశం ఉంది. ఈ జిల్లాల  నుంచి ఒకరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. కళా వెంకట్రావు, గౌతు శ్యామసుందర శివాజీ, కె. అప్పల్నాయుడు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు కావలి ప్రతిభా భారతి, జి. సంధ్యారాణి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎస్టీ, మైనారిటీ కోటాల్లో ముడియం శ్రీనివాస్, ఎంఏ షరీఫ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు.

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు తోట త్రిమూర్తులు, పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నట్లు వినిపిస్తోంది. ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ పేర్లను మంత్రివర్గంలో చోటుకై  లోకేష్ ఇప్పటికే ప్రతిపాదించగా అనంతపురం జిల్లాలో పరిటాల సునీతకు ఇబ్బందులు కలిగించే ఎవ్వరికీ మంత్రివర్గంలో చోటు కల్పించొద్దని బాలకృష్ణ చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చు.

రాయలసీమ జిల్లాల నుంచి కాలవ శ్రీనివాసులు, బీకే పార్ధసారధి, ఎస్‌వీ సతీష్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డీకే సత్యప్రభ పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. కాగా అనేక ప్రలోభాలు కురిపించి వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలలో చాలామంది విస్తరణపై ఆశలు పెట్టుకున్నారని వినిపిస్తోంది. మొత్తానికి ఆశావహుల ఒత్తిళ్లు ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగా మారాయని పార్టీవర్గాలంటున్నాయి.

మరిన్ని వార్తలు