-

వివాహేతర సంబంధాలతోనే వివాదాలు

21 Sep, 2014 02:14 IST|Sakshi
వివాహేతర సంబంధాలతోనే వివాదాలు

 సంతకవిటి : వివాహేతర సంబంధాల కారణంగానే గ్రామాల్లో గొడవలు ఏర్పడి క్రైం రేటు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  శనివారం సంతకవిటి పోలీస్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. తొలుత పోలీస్ క్వార్టర్స్‌లోకి వెళ్లి వర్షాలకు కారుతున్న గదులను పరిశీలించారు. 2003లో నిర్మాణం జరిగి ఉండడంతో మరో నాలుగేళ్ల వరకూ మరమ్మతులకు అవకాశం లేదన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో తలెత్తే వివాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు రావడమే కాకుండా, పిల్లల భవిష్యత్ నాశనం అవుతోందని..ఈ విషయూన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు.
 
 ఇచ్ఛాపురం నుంచి  విజయనగరం సరిహద్దు వరకూ హైవేలో నాలుగు పెట్రోలింగ్ బృందాలు తిరుగుతూ డ్రంక్ కమ్ డ్రైవ్ చేసేవారిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అలాగే పోలీసు విభాగంలో హైవేలో రెండు అంబులెన్స్‌లు నడుపుతున్నామన్నారు.  జిల్లాలో శాంతి భద్రతులు అదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. దోపిడీలు కూడా తగ్గాయన్నారు.  ఇటీవల రెండు చోట్ల భారీ చోరీలు జరిగాయని, వాటికి పాల్పడిన నిందితుల ఆచూకీ కొలిక్కివచ్చిందన్నారు. జిల్లాలో 30 మంది కానిస్టేబుళ్ల కొరత ఉందన్నారు. పుల్లిట, తాలాడ గ్రామాల్లో మాజీ నేరస్తుల కుటుంబాలపై దృష్టిసారించి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామని, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ పి.సురేష్‌బాబు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు