చోదకా.. కనుపాప జాగ్రత్త !

17 Sep, 2018 12:19 IST|Sakshi

డ్రైవర్లలో పెరుగుతున్న దృష్టి లోపాలు

అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం

కలర్‌ బ్లైండ్‌నెస్‌తో రహదారి ప్రమాదాలు

కళ్లు పొడిబారి దురదలు, మంటలు రావడం.. కంటిలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం వాహనచోదకుల్లో సహజంగా కనిపించే సమస్యలు. కలర్‌ బ్లైండ్‌నెస్, దృష్టి లోపాలకు చికిత్స పొందక పోవడం వలన రెటీనా దెబ్బతినడం డ్రైవర్లలో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. డ్రైవర్లు నేత్ర సంరక్షణపై అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు 17 డ్రైవర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం...

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరికీ నేత్ర సంరక్షణ ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే వాహనచోదకులు నేత్ర సమస్యలపై మరింత జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న సమస్యే కదా అని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక కంటి వ్యాధులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో డ్రైవింగ్‌ చేస్తున్న వారిలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెపుతున్నారు. నేత్ర సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా కామన్‌గా వాడే ఐ డ్రాప్స్‌ వేసుకోవడం ద్వారా తొలిదశలోనే పరిష్కారం పొందవచ్చని సూచిస్తున్నారు. డ్రైవర్లలో ఎక్కువగా వచ్చే నేత్ర సమస్యలు ఇవి..

కళ్ల మంటలు, దురదలు..
సహజంగా ప్రతి ఒక్కరూ నిమిషానికి 10 నుంచి 15 సార్లు కను రెప్పలను మూస్తుంటాం. కానీ డ్రైవింగ్‌ చేసే వాళ్లు కళ్లు రెప్పార్పకుండా అలాగే డ్రైవింగ్‌ చేస్తుంటారు. దీంతో నిమిషానికి మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే రెప్పలు మూస్తుంటారు. దీంతో కంటిపై ఉండే నీటిపొర ఆవిరై పోతుంది. దీంతో కంటిలో దురద రావడం, మంటలు, ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం జరుగుతుంది. ఈ సమస్యతో డ్రైవర్లు అధిక సంఖ్యలో బాధపడుతున్నారు. తొలిదశలో ఐ డ్రాప్స్‌ వాడటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధిగా మారి జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దృష్టిలోపాన్ని నిర్లక్ష్యం చేయడం..
డ్రైవర్లలో సైతం వయస్సు రీత్యా దృష్టిలోపం(సైట్‌) వస్తుంటుంది. అలాంటి వారు ఎంతలోపం ఉన్నప్పటికీ కళ్లజోడు తప్పనిసరిగా వాడాలి. వాడకుంటే ఈ సమస్య మరింత పెరిగి కంటి రెటీనాపై ప్రభావం చూపి అది దెబ్బతినే అవకాశం ఉంది. రెటీనా దెబ్బతినడం ద్వారా భవిష్యత్‌లో పూర్తిగా చూపు కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో సైతం డ్రైవర్లు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దృష్టిలోపం విషయంలో తొలిదశలోనే కళ్లజోడు వాడాల్సిన అవసరం ఉంది.

నిద్రలేమి సమస్య..
డ్రైవర్లు పగలుతో పాటు రాత్రిళ్లు సైతం డ్రైవింగ్‌ చేయడం వలన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో కళ్లు మంటలు, తీవ్రమైన తలనొప్పిరావడం జరుగుతుంది. కళ్లు ఎర్రగా మారడం కూడా చూస్తుంటారు. కళ్లు ఎర్రగా మారడం కూడా ఒక సమస్యగానే గుర్తిసాం. ఇలాంటి వారిలో దృష్టిలోపాలు వచ్చే అవకాశం ఉంది.

కలర్‌ బ్లైండ్‌నెస్‌..
డ్రైవర్లు రాత్రిళ్లు కాంతి వంతమైన లైటింగ్‌ను చూడటం వలన కలర్‌ బ్లైండ్‌నెస్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఎదురుగా  వచ్చిన వాహనం దాటిపోయిన తర్వాత నిమిషాల పాటు రంగులు కనిపించవు. ఈ దశలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో తేలింది. కలర్‌ బ్లైండ్‌నెస్‌ విషయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అప్రమత్తత అవసరం
నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసే వారు చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డ్రైవర్లు ప్రతి ఆరునెలలకు ఓసారి కంటి పరీక్షలు చేయించుకోవడం మేలు. మావద్దకు  కళ్లు మంటలు, దురదలు, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండటం వంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. అందుకు కంటిలోని నీటిపొర ఆవిరై కళ్లు పొడారిపోవడమే కారణం. దృష్టిలోపాలను సైతం అశ్రద్ధ చేయకుండా కళ్లజోడు వాడటం ద్వారా రెటీనా(కంటినరం) దెబ్బతినకుండా చూడవచ్చు. అశ్రద్ధ చేయడం వలన అంధత్వంతో పాటు, దీర్ఘకాలిక కంటి వ్యాధులు ఉన్న వారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.– డాక్టర్‌ నాదెళ్ల విష్ణువర్ధన్,చైర్మన్, శంకర నేత్ర చికిత్సాలయం

మరిన్ని వార్తలు