నకిలీ నోట్ల ముఠా అరెస్టు

13 Feb, 2016 23:52 IST|Sakshi

శృంగవరపుకోట రూరల: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను శృంగవరపుకోట పట్టణ ఎస్‌ఐ కె.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన నకిలీ ఐదొందల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ ఎం.లక్ష్మణమూర్తి, ఎస్‌ఐ కె.రవికుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం చిననాగయ్యపేట గ్రామానికి చెందిన తమటపు దండునాయుడు, బుద్దల శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), బొద్దు శ్రీనివాస్ (పిఠాపురం), యడ్ల గోపాలకృష్ణ (జగ్గంపేట), మండూరు రమేష్ (గణపవరం), కేసనాపల్లి రమేష్‌కుమార్(తాడేపల్లిగూడెం)లు ఒక ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలు ఆడుకునే నకిలీ ఐదొందల నోట్లకట్టలకు పైనా..
 
  దిగువున ఒరిజనల్ ఐదొందల నోట్లను పెట్టి ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి సిద్ధంగా ఉంచుకుంటారు. ఎవరైనా లక్ష ఒరిజనల్ నోట్లు ఇస్తే మూడు లక్షల దొంగనోట్లు ఇస్తామంటూ అమాయకులను ప్రలోభపెడతారు. ఈ నేపథ్యంలో ఎస్.కోట పట్టణ ంలోని వన్‌వే ట్రాఫిక్ సమీపంలో నివసిస్తున్న ఫిర్యాదుదారుడుకు ముఠా సభ్యుడు దండునాయుడు తారసపడి, అసలు నోట్లకు మూడింతలు దొంగనోట్లు ఇస్తామంటూ నమ్మబలికారు. దీంతో ఆయన అప్రమత్తమై ముఠా సభ్యుల ఆట కట్టించాలని భావించి ఎస్‌ఐ కె.రవికుమార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన సూచనల మేరకు ఫిర్యాదుదారుడు ముఠాసభ్యుడికి రూ.30 వేలు ఒరిజనల్ నోట్లు అందజేసి లక్ష నకిలీ నోట్లు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఎస్‌ఐ చాకచక్యంతో కానిస్టేబుల్ శ్రీనును సాధారణ వ్యక్తిగా ఆ ముఠా వద్దకు పంపించారు.
 
 బేరసారాలు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రూ.15 లక్షల నకిలీ నోట్లతో పాటు ఆరుగురు ముఠాసభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురిని పెందుర్తి వద్ద, దండునాయుడును దేవరాపల్లి మండలం చిననాగయ్యపేటలో పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ లక్ష్మణ మూర్తి ప్రజలకు సూచించారు. నకిలీ నోట్ల సమాచారం తెలిస్తే తమకు విషయం తెలియజేయాలని కోరారు. కాగా, 20 రోజుల పాటు శోధన చేసి ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఎస్‌ఐను, పోలీసు సిబ్బందిని అభినందించారు.
 

మరిన్ని వార్తలు