మంత్రి ఇలాకాలో సర్వేరాయుళ్లు..

31 Jan, 2019 08:36 IST|Sakshi
బొబ్బిలి : సర్వేరాయుళ్ల వద్ద ఉన్న ట్యాబ్‌లు, ఐడెంటిటీ కార్డులు చూపుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

పోలీసులకు పట్టిచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు

బొబ్బిలి:  నాలుగు రోజులుగా జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్న సర్వేరాయుళ్లు బొబ్బిలిలో బుధవారం సంచరించారు. మంత్రి రంగారావు ఇలాకాలో సుమారు పది మందిదాకా సర్వేల కోసం ట్యాబ్‌లు పట్టుకుని తిరుగుతుండడంతో వారిలో కొంత మందిని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. మీరు ఓట్లు తొలగించడానికే  వచ్చారని నిలదీశారు. వారి వద్ద స్మార్ట్‌ మార్కెటింగ్‌ రీసెర్చ్‌ కంపెనీ పేరుతో ఐడెంటిటీ కార్డులను గుర్తించారు. హెచ్‌ ఎల్లప్ప, తదితరులను  అసలు ఎందుకువచ్చారు? ఏం చేస్తున్నారని పదేపదే నిలదీసినా పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 27, 28, 29 వార్డుల్లో కొంతమంది యువకులు ట్యాబ్‌లు పట్టుకుని ఇంటింటికీ తిరగడంతో అనుమానం వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకుడు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సూచన మేరకు ప్రముఖ  న్యాయవాది మజ్జి జగన్నాథంనాయుడు, మాజీ కౌన్సిలర్‌ పాలవలస ఉమాశంకర్, సతీష్, రియాజ్‌ఖాన్, తదితరులు వారిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఎస్సై ప్రసాద్‌ వారిని మీరు ఎంతమంది సర్వేకు వచ్చారు.. అందరూ కలిసి కలవాలని సూచించి పంపించేశారు.

కొండవెలగాడలో...
నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సర్వే చేపడుతున్న ఓ యువకుడిని జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయు డు ఆధ్వర్యంలో స్థానికులు పట్టుకుని నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు. పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ గ్రూప్‌ పేరుతో పేరూ, ఊరూ లేని గుర్తింపుకార్డు తగిలించుకున్న ఓ యువకుడు ఆ గ్రామంలో బుధవారం ఉదయం సర్వే చేపట్టేందుకు వచ్చాడు. గ్రామస్తులు సదరు యువకుడిని ఏ సంస్థ తరఫున సర్వే చేపడుతున్నావని వివరాలు అడుగగా.. సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడుకు విషయం తెలియజేయగా... ఆయన వచ్చి సదరు యువకుడిని ఎస్సై అశోక్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే విషయాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్ల జాబితా సరిచూసుకుని పేర్లు లేకపోతే చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి కొండపేటలో కూడా ఇద్దరు యువకులు సర్వే చేపట్టేందుకు రాగా స్థానికులు వారిని ప్రశ్నించగా ఎటువంటి వివరాలు చెప్పలేదు. మరింత గట్టిగా నిలదీసేసరికి యువకులు పరారయ్యారు. సర్వేకు వచ్చిన ఆ ముగ్గురు యువకుల వద్దనున్న ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా ఉండడం విశేషం.

మరిన్ని వార్తలు