సర్వే చేస్తున్న యువకులు పట్టివేత

4 Mar, 2019 07:06 IST|Sakshi
సర్వే చేస్తున్న యువకులు

పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్‌): సర్వేల పేరుతో నగరంలో సంచరిస్తున్న ఇద్దరు యువకులను వైఎస్సార్‌సీపీ నాయకులు  టూటౌన్‌  పోలీసులకు అప్పగించారు. ఏలూరు 38వ డివిజన్‌లో ఆదివారం రాత్రి  ఇద్దరు యువకులు  ట్యాబ్‌లను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే చేస్తున్నరంటూ స్థానికులు వైఎస్సార్‌ సీపీ నాయకులకు సమాచారం అందించారు. నాయకులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. వారి వద్ద ఉన్న ట్యాబ్‌లు పరిశీలించారు. ఏలూరులోని ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకుని ఉంటున్న ఓ వ్యక్తి ఏలూరు నియోజకవర్గం మొత్తం సర్వే చేసేందుకు 40 మంది యువకులను నియమించాడని, వారికి ట్యాబ్‌లు ఇచ్చి సర్వే చేసేందుకు పంపించాడని ఆ యువకులు  చెప్పారు. ప్రభుత్వాన్నికి అనుకూలంగా సర్వే చేస్తున్నారని నిర్ధారించుకున్న పార్టీ నాయకులు వెంటనే టూటౌన్‌ పోలీసులకు వారిని అప్పగించారు. ఈ సర్వే  వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నవారిని గుర్తించేందుకనే, తరువాత వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని, సర్వే  చేయిస్తున్న వారిన వెంటనే  అరెస్ట్‌ చేయాలని పార్టీ నాయకులు టూటౌన్‌ సీఐ  బి.జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ బండారు కిరణ్‌కుమార్,  పార్టీ లీగల్‌ సెల్‌  ప్రధాన కార్యదర్శి టి.శశిధర్‌రెడ్డి, నాయకులు నవహార్ష  తదితరులు  పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

దొండపాడులో ఒక వ్యక్తి పోలీసులకు అప్పగింత
ఏలూరు (టూటౌన్‌): బోగస్‌ సర్వే చేస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జనసేన ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి అర్జా ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు నియోజకవర్గం దొండపాడులో ఆదివారం ఉదయం సర్వే పేరుతో వచ్చిన వ్యక్తిని స్థానికులు నిలదీశారు. దీంతో అది బోగస్‌ సర్వే అని తేలింది. అతడిని ప్రశ్నించగా పేరు సుంకర ఉపేంద్ర, ఖమ్మం నుంచి వచ్చానని చెప్పాడు. మొత్తం 50 మంది ఉండగా, బృందాలుగా విడిపోయి 15 మంది దెందులూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నామని తెలిపాడు. ఏలూరులోని ఓ లాడ్జిలో ఉంటూ ఈ సర్వే చేస్తున్నట్టు చెప్పాడు. ఉపేంద్రను ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. బోగస్‌ సర్వేపై సమగ్ర విచారణ చేయాలని ఫిర్యాదు చేసినట్టు ప్రసాద్‌ తెలి పారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారికి కూడా వినతి పత్రం అందజేశామన్నారు.

మరిన్ని వార్తలు