కరువు వ్యథ

21 Jul, 2014 03:23 IST|Sakshi
కరువు వ్యథ
 •     ప్రమాదకర స్థాయికి పడిపోయిన భూగర్భజలాలు
 •      వెయ్యి నుంచి 1200 అడుగుల లోతులో పాతాళ గంగ
 •      217 వ్యవసాయ, 143 తాగునీటి బోర్లు ఎండిపోయిన వైనం
 •      నిలువునా ఎండుతున్న మామిడిచెట్లు  
 •      భారీ వర్షాలు కురవకపోతేఉద్యానపంటలకు తీవ్ర నష్టం
 • కరువు బెంబేలెత్తిస్తోంది. వరుణుడు కరుణించడం లేదు. పాతాళగంగ పలకరించలేదు. భూగర్భజలమట్టం అడుగంటింది. వెయ్యి-1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటిజాడ దొరకడం లేదు. ఈక్రమంలో జిల్లాలోని రైతన్నలు ఓ వైపు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటే..మరోవైపు మామిడిలాంటి ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతులు వాటిని కాపాడుకోలేక మధనపడుతున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు కన్నబిడ్డల్లా చూసుకున్న మామిడిచెట్లు కళ్లముందే ఎండిపోతుంటే కుమిలిపోతున్నారు. భారీ వర్షాలు కురవకపోతే ఉద్యాన వనపంటలకు తీవ్రమైన నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది.
   
  సాక్షి, చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది సరైన వర్షపాతం నమోదు కాకపోవడం, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులే ఉండడంతో ఒక్కసారి భూగర్భజల నీటిమట్టం ఊహించనిస్థాయికి పడిపోయింది. గతేడాది 500-600 అడుగుల లోతులోని బోరుబావుల ద్వారా నీరు వచ్చేది. ఈ ఏడాది అవే బోరుబావులు ఎండిపోయాయి. వాటి సమీపంలో 850 నుంచి వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటిజాడ కనిపించడం లేదు. కుప్పం నియోజకవర్గంలో 1200 అడుగుల వరకూ నీళ్లు పడని దుర్భర పరిస్థితి. జిల్లాలో 217 వ్యవసాయబోర్లు ఎండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో ఉద్యానరైతులు తీవ్ర వేదన పడుతున్నారు.

  జిల్లాలో 71వేల హెక్టార్లలో మామిడి పంటలు సాగవుతున్నాయి. 15ఏళ్ల వయసున్న చెట్లు కూడా నీటి ఎద్దడిని తట్టుకోలేకపోతున్నాయి. జిల్లాలో సగటున ఎకరాకు 5 మామిడి చెట్లు ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ ఏడాది వర్షాభావంతో వేలాది చెట్లు ఎండిపోయిన పరిస్థితి. రైతులు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నా నీళ్లు సరిపోవడం లేదు. ఒక్కో చెట్టుకు ఏడాదికి 2-3వేల రూపాయల విలువైన కాయలు(తక్కువ లేకుండా) కాస్తాయి. ఈ లెక్కన చెట్లు ఎండిపోవడం వల్ల ఎకరాకు పది వేల రూపాయల చొప్పున నష్టమే!
   
  భారీ వర్షం పడితేనే..
   
  పాతాళానికి వెళ్లిన జలం మళ్లీ బోరుబావులకు అందాలంటే ఈ ఏడాది 934 మి ల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఈ ఏడాది 113 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇంకా 800 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదుకావాలంటే ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురవాలి. లేదంటే జిల్లాలోని ఉద్యానపంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
   
  తాగునీటికీ కటకట
   
  భూగర్భజల ప్రభావంతో 143 తాగునీ టిబోర్లు ఎండిపోయాయి. దీంతో 11 మండలాల్లోని 443 ఆవాసప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరస్థితి నెలకొంది. మ రో 8 మండలాల్లోని 83 ఆవాసప్రాంతా ల్లో ప్రమాదకర స్థితి. వర్షాలు పడకుండా పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సంఖ్య మరిం తపెరిగే అవకాశం ఉంది.  ఈ గ్రామాల్లో  562 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు రోజూ నీటి సరఫరా చేయడం లేదు. 2-3 రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. దీంతో పల్లెసీమల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
   
  వాసుదేవరెడ్డి గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు గ్రామ రైతు. అతని ఐదెకరాల పొలంలో 3 ఎకరాల్లో మామిడి, 2 ఎకరాల్లో కొబ్బరిసాగు చేశాడు. వీటి కోసం 7బోర్లు వేశాడు. వర్షాలు లేవు. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో 6 బోర్లు ఎండిపోయాయి. ఉన్న ఒక్క బోరుకు కొద్దిమేర మాత్రమే నీళ్లు వస్తున్నాయి.  నీళ్లు లేక..బోరునీరు సరిపడక పది రోజుల తేడాలో 15 ఏళ్ల వయస్సున్న 12 మామిడి చెట్లు ఎండిపోయాయి.

  కంటికిరెప్పలా కాపాడుకున్న చెట్లు ఎండిపోవడాన్ని భరించలేక పది రోజుల కిందట మరో బోరు 847 అడుగుల లోతు వేశాడు. 87 వేల రూపాయలు ఖర్చయింది. నీటి జాడ మాత్రం కనిపించలేదు. ఎండుతున్న చెట్లు ఓ వైపు...అప్పుచేసినా నీటిజాడ కనిపించలేదన్న బాధ మరోవైపు...వీటికి తోడు ఇటీవల ఆయన ట్రాక్టర్ దొంగతనానికి గురైంది. ఇప్పటికే 4లక్షల రూపాయలు అప్పు ఉంది. దీంతో బోరుమని విలపించడం తప్ప ఏం చేయలేని నిస్సహాయస్థితి వాసుదేవరెడ్డిది.
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా