హంద్రీనీవా ఇంజినీర్లపై రైతుల ఆగ్రహం

10 Mar, 2015 16:26 IST|Sakshi

అనంతపురం : గ్రామాల్లో తాగునీరు లేక జనం అల్లాడుతుంటే అధికారులు ఫ్యాన్ల కింద కూర్చుని కాకమ్మ కథలు చెబుతున్నారని సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాగులపాడు వద్ద హంద్రీనీవా కెనాల్ నుంచి గుంతకల్లు మండలంలోని పలు గ్రామాలకు తాగు, సాగు నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ ఆధ్వర్యంలో రైతులు హంద్రీనీవా కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. రాగులపాడు వద్ద హంద్రీనీవా కెనాల్ నుండి 17 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపేందుకు మ్యాప్‌తో నివేదికను సమర్పించాలని స్వయానా నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశించినా ఇంజినీరింగ్ అధికారులు కాలాయాపన చేయడంపై అన్నదాతలు ఆగ్రహించారు.

నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన జేఈ రాఘవేంద్రపై నిప్పులు చెరిగారు. ఇఇ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఆయనతో వాదనకు దిగారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ.. . హంద్రీనీవా కెనాల్ నుండి 17 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి నీటిని మళ్లిస్తే మండలంలోని దోనిముక్కల, పులగుట్టపల్లి, నల్లదాసరపల్లి, నాగసముద్రం తదితర గ్రామాల్లోని చెరువులు నిండటమే కాకుండా దాదాపు 5 వేల బోరుబావుల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. ఆయా గ్రామాల రైతులు చందాలు వేసుకుని సొంత ఖర్చులతో సర్వే చేయించి ఆ కెనాల్ మ్యాప్‌ను ఎమ్మెల్యే ద్వారా నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాకు అందజేశామని వారు తెలిపారు. మంత్రి నివేదిక పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే బుధవారం సాయంత్రంలోగా నివేదికను మంత్రికి అందజేస్తామని హంద్రీనీవా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు హామీ ఇవ్వడంతో రైతన్నలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కదిరప్ప, నరసింహులు, సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి గోవిందు, నాయకులు వీరభద్రస్వామి, దేవేంద్ర, చల్లా నాగేంద్ర, భాషా, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు