ఎమ్మెల్యే జీవీని నిలదీసిన రైతులు

12 Nov, 2018 12:10 IST|Sakshi
ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులును ముట్టడించిన పెదకంచర్ల రైతులు

గుంటూరు, వినుకొండ: సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో భగ్గుమన్న రైతులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులును ఆదివారం ముట్టడించారు. రాష్ట్రస్థాయి సీఎం కప్‌ బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని తెలుసుకుని ట్రాక్టర్లపై అక్కడికి వెళ్లి నిలదీశారు. మండలంలోని పెదకంచర్ల ప్రాంతంలోని పది గ్రామాల రైతుల పొలాలు నీరు అందక బీడుగా మారుతున్నాయని, మాగాణి భూములు బద్దలుగా పగిలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెరువుకు సాగర్‌ జలాలు వచ్చే కాలువ తూమును బొగ్గరం వద్ద అధికారులు మూసివేయటంతో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. వెంటనే తూముకు వేసిన అడ్డును తొలగించకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. మాచర్ల ప్రాంతంలో సాగర్‌ కాలువకు గండి పడటంతో నీటి విడుదల ఆపేశారని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే జీవీ సర్దిచెప్పారు. అయినా రైతులు మాత్రం తమ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సిందే అని పట్టుపట్టారు. దీంతో ఆయన ఎన్‌ఎస్‌పీ అధికారులకు ఫోన్‌చేసి తూముకు అధికారులు వేసిన అడ్డంకిని తొలగించాలని సూచించారు. దీంతో శాంతించిన రైతులు వెనుదిరిగారు.  

మరిన్ని వార్తలు