ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి జీతం

25 May, 2014 01:17 IST|Sakshi

 సాక్షి, కాకినాడ : తెలంగాణ తో కూడిన ఆంధ్రప్రదేశ్‌తో సీమాంధ్ర ఉద్యోగులకు తొంబైతొమ్మిదీ పాయింటు తొమ్మిది తొమ్మిది శాతం రుణం తీరిపోయింది. 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లాలోని ఉద్యోగులు మే నెలకు సంబంధించి చిట్టచివరి జీతం అందుకున్నారు. ఈ నెల 24వ తేదీ ఆఖరి గడువు కావడంతో ఇంతవరకూ అందిన నివేదికల ఆధారంగా మొత్తం రూ.172 కోట్లు జిల్లాకు వచ్చింది. ఖజానా కార్యాలయంలో ఈ మేరకు జమ కావడంతో అంచెలంచెలుగా ఆయా ఉద్యోగుల ఖాతాల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా జీతాలు జమవుతాయి. వివరాల్లోకి వె ళితే జిల్లాలో పెన్షనర్లు 38 వేల మంది ఉండగా వారికి దాదాపు రూ.40 కోట్లు వచ్చాయి.
 
 అలాగే ప్రభుత్వోద్యోగులు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వెరసి జిల్లాలో 56 వేల మంది వున్నారు. వీరికోసం ప్రత్యేకించి రూ.132 కోట్లు వ చ్చాయి. వెరసి రూ.172 కోట్లు వారివారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తం నడుస్తున్న మే నెలకు సంబంధించిన జీతం,పెన్షన్ల తాలూకు సొమ్ము కాగా ఇంకా ఏమైనా మిగిలివుంటే  అవి కూడా ఇవ్వడానికి ఈ నెల 26 వ తేదీ గడువు పొడిగించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిప్రకారం ఇంక్రిమెంట్లు, పే రివిజన్ తాలూకు హెచ్చుతగ్గులు ఇతర  బకాయిలేమైనా వుంటే అవీ వెరసి ఇవ్వాల్సిన బకాయిలు జూన్ 1వ తేదీకి సంబంధించిన ఒక్క రోజుకు చెందిన వేతనాలు, పింఛన్లు  చెల్లించాల్సి ఉందన్నారు.ఇంకెంత రావాలో అంత మొత్తం చెల్లించేందుకు పై గడువు ఇచ్చినట్టు జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక సంఘాల(జేఏసీ)ప్రతినిధులు పితాని త్రినాథరావు, బూరిగ ఆశీర్వాదం ‘సాక్షి’ కి  శనివారం రాత్రి తెలిపారు.
 
 హెల్తు అసిస్టెంట్లకు శుభవార్త
 ఇదిలావుండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు హెల్తు అసిస్టెంట్ల బకాయి జీతాలు దాదాపు రూ.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినందుకు జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా పూర్వపు జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెల్తు అసిస్టెంట్ల పోరాటం వృధా కాలేదని, వారి బాధలు పెద్ద మనసుతో అర్ధం చేసుకున్నారని ఉన్నతాధికారులను జేఏసీ తరపున ప్రత్యేకంగా కొనియాడుతూ శనివారం రాత్రి తీర్మానం చేశారు.
 

మరిన్ని వార్తలు