ముచ్చటైన గ్రామం..నేడు మృత్యుధామం

22 Oct, 2014 02:59 IST|Sakshi
ముచ్చటైన గ్రామం..నేడు మృత్యుధామం

 పిఠాపురం :మృత్యువు సాగించిన మారణసేద్యానికి ఫలసాయంలా.. పంటపొలాల్లో దొరికే మాంసపు ముద్దలు, చెట్ల కొమ్మలకు వేలాడే శరీరావశేషాలు.. చిమ్మిన నెత్తుటితో ఎర్రబారిన ఆకుపచ్చని వరిదుబ్బులు..శోకించి, శోకించి, కన్నీరు చారికలు కట్టిన ముఖాలు- ఇదీ ఇప్పుడు కొత్తపల్లి మండలం వాకతిప్ప ముఖచిత్రం. 17 మందిని పొట్టన పెట్టుకుని, 30 కుటుంబాలను కన్నీటి కడలిలోకి నెట్టిన బాణసంచా విస్ఫోటం మిగిల్చిన దుర్భర దృశ్యం. పచ్చని పైరులతో, పంట కాలువలతో చూడముచ్చటగా ఉండే ఊరి గుండెల్లో రేగిన కార్చిచ్చులా సోమవారం సంభవించిన ఘోరం వాకతిప్పతో పాటు మరో రెండు గ్రామాలను కలచివేస్తూనే ఉంది. దుర్ఘటనలో వాకతిప్ప, పెదకలవలదొడ్డి, నిదానందొడ్డి గ్రామాలకు చెందిన 17 మంది మృత్యువాత పడగా.. ఓ బాలిక ఆచూకీ లేకుండా పోయింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్రామాల వారు.. కన్నీటిని తుడుచుకుంటూ, శోకాన్ని ఆపుకొంటూ పొలాల్లో, కాలువలో ఇంకెవరైనా అభాగ్యులు విగతజీవులుగా పడి ఉన్నారేమోనని దుర్ఘటన స్థలం పరిసరాల్లో వెతుకుతున్నారు. కారణం.. విస్ఫో టం సంభవించిన బాణసంచా తయారీకేంద్రానికి దాదాపు అరకిలోమీటరు దూరంలో ఓ మహిళ మృతదేహం కాళ్లు తెగిన స్థితిలో మంగళవారం కనిపించడమే. ఆమెను వాసంశెట్టి రాఘవగా కుమారుడు గుర్తించాడు. అంత దూరం ఎగిరిపడిందంటే పేలుడు  స్థాయి అర్థమవుతుంది.
 
 భారీ మందుపాతర స్థాయిలో విస్ఫోటం..
 సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంభవించిన పెను విస్ఫోటం ధాటికి సంఘటనాస్థలం నుంచి సుమారు  500 మీటర్ల వ్యాసార్ధంలో పొలాలు, కొబ్బరి తోటలకు నెత్తుటి మరకలంటాయి. పొలాల్లో అక్కడక్కడా మృతుల శరీర భాగాలు, మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయి. కొన్ని అవశేషాలు పరిసరాల్లోని చెట్లకు వేలాడుతున్నాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న పంటపొలంలో సుమారు అరెకరం వ్యాసార్ధంలో గొయ్యి  పడడం చూస్తే..అక్కడ భారీ మందుపాతరను పేల్చినట్టనిపిస్తోంది. పరిసరాల్లోని కొబ్బరి, మామిడి, టేకు చెట్లు నిలువునా దగ్ధమయ్యాయి. దుర్ఘటన స్థలాన్ని చూసిన నిపుణులు సుమారు 1000 కేజీల మందుగుండుతో పేల్చిన మందుపాతర స్థాయిలో విధ్వంసం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. చుట్టూ ఉన్న చెట్లు విస్ఫోటంతో ఎగసిన అగ్నికీలలను, బాణసంచాను దూరానికి వెళ్లకుండా నిరోధించాయని, లేకుంటే దగ్గరలో ఉన్న గ్రామానికి కూడా ముప్పు వాటిల్లేదని అగ్నిమాపకాధికారులు అంటున్నారు.
 
 ముందు రోజు జరిగి ఉంటే..
 సోమవారంనాటి పేలుడు ముందు రోజైన ఆది వారం జరిగి ఉంటే.. పసివాళ్ల పాలిట మరణశాసనమై ఉండేదని స్థానికులు దడదడలాడే గుండెలతో చెపుతున్నారు.  ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పేద కుటుంబాలకు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు బాణసంచా తయారీ పనికి వెళ్లారు. మతాబులు కూరితే రూ.వంద వరకు కూలి వస్తుందని, అది దీపావళి సరదాకు ఉపయోగపడుతుందని వారి ఆశ. పేలుడు తర్వాత వారి తల్లిదండ్రులు ఘోరం ఒకరోజు ముందు సంభవించి ఉంటే తమ బిడ్డలు ఏమైపోయే వారోనని ఊహించుకుని, భీతావహులవుతున్నారు. దేవుడే దయ తలచాడని దండాలు పెడుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం దుర్ఘటన స్థలానికి తరలి వస్తున్నారు. మంగళవారం నాటికీ భయానకంగా కనిపిస్తున్న అక్కడి దృశ్యాల్ని చూసి తల్లడిల్లిన పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. చెల్లాచెదురుగా కనిపిస్తున్న మాంసం ముద్దలను చూసి గగుర్పాటు చెందుతున్నారు. విస్ఫోటం తీవ్రతకు మూగజీవులూ బలయ్యాయి. దుర్ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న రెండు కుక్కలు చనిపోగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని పొలా ల్లో కట్టి ఉన్న పాడిపశువులు మంటల తీవ్రతకు విలవిలలాడుతుంటే.. స్థానికులు చూసి కట్టు విప్పడంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాయి.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు