ఐదుగురు ఏపీ ఎమ్మెల్సీల ప్రమాణం

31 Mar, 2015 01:33 IST|Sakshi
ఐదుగురు ఏపీ ఎమ్మెల్సీల ప్రమాణం

సాక్షి, హైదరాబాద్: ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సోమవారం మండలి కార్యాలయంలోని చైర్మన్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన నలుగురు, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఒకరు ఉన్నారు. ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికైనవారు కాగా ఇద్దరు టీడీపీ నేతలు, ఒకరు టీడీపీ మద్దతుతో ఎన్నికైనవారు ఉన్నారు. శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరితో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించా రు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్ (తూర్పుగోదావరి), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం) దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రాంగణమంతా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్సీల అనుచరులతో కోలాహలంగా మారింది. ‘జై...జగన్..!, వైఎస్సార్ జిందాబాద్..’ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్సీ వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తనకు ఇది రాజకీయ పునర్జన్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ముఖ్యనేతలు పెన్మత్స సాంబశివరాజు, బేబినాయన, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, సుంకరి రమణమూర్తి, మైనారిటీ నేత మహ్మద్ నాసిర్, తూర్పు గోదావరి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వి.వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.
 
 స్వామికి రాజమౌళి గుప్త సన్మానం
 
 ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త.. ఎమ్మెల్సీ వీరభద్రస్వామికి శాలువా కప్పి అభినందించారు. పలువురు స్వామి అభిమానులు కూడా ఆయన్ని సత్కరించారు. బోస్ ప్రమాణం చేయగానే ఆయన అనుచరులు ఆయన్ని అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల నినాదాలతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఇది గమనించిన పోలీసులు రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు.
 
 టీడీపీ సభ్యుల ప్రమాణం
 
 ఎమ్మెల్సీలుగా ఎన్నికైన టీడీపీ నేతలు వి.వి.వి.చౌదరి, గుమ్మడి సంధ్యారాణి, ఆ పార్టీ మద్దతుతో ఎన్నికైన ఎ.ఎస్.రామకృష్ణలతో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. చౌదరి, సంధ్యారాణి ఎమ్మెల్యేల కోటాలో, రామకృష్ణ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరఫున ఎన్నికైన గుండుమల్ల తిప్పేస్వామి తన సమీప బంధువు మరణంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.

 

16న ప్రివిలేజ్ కమిటీ సమావేశం
 
 ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 16న సమావేశం కానుంది. సోమవారం కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, సభ్యుడు కె.రామకృష్ణ  హాజరయ్యారు. సమాచారలోపం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కాలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్.కె.రోజా స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం, ఒక అధికారిపై సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ అంశాలపై ఈనెల 16న జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
 

 

 

మరిన్ని వార్తలు