పోలవరం వద్ద గోదావరి ఉదృతి

3 Aug, 2019 16:35 IST|Sakshi

సాక్షి, పోలవరం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరగడంతో పోలవరం పరిసర ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భారీగా వరదనీరు రావడంతో ఇప్పటికే పనులు పూర్తిగా ఆగిపోయాయి. స్పిల్‌వే పొడవునా 48 గేట్ల నుంచి క్లస్టర్‌ స్థాయి దాటి రెండు మీటర్ల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించే ఉద్దేశంతో గత ప్రభుత్వం స్పిల్ వే వెనుక వైపు గోదావరికి అడ్డంగా తాత్కాలికంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ చాలా వరకూ కొట్టుకుపోయింది. రివర్‌స్లూయిస్‌ గేట్ల ద్వారా వరదను మళ్లించడానికి వేసిన అడ్డుకట్ట ఇప్పటికే తెగిపోయింది. స్పిల్‌వే పనులకు ఆటంకం లేకుండా వేసిన అడ్డుకట్ట కూడా బీటలువారుతోంది.

ముంపులో లంక గ్రామాలు
ధవళేశ్వరం నుంచి భారీగా నీరు విడుదలవడంతో లంక గ్రామాల కాజ్వేలు మునగిపోయాయి. వేలేరుపాడు మండలంలోని కోయిదా పరిసరాల గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఆచంట మండలంలో ఏడు లంక గ్రామాలకు పడవ ప్రయాణం నిలిపివేశారు. గోదావరి ముంపు గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు లాంచీలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రేపాకగొమ్ము, కొయిదా, కటుకూరు, పేరంటాళ్ల పల్లి గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులను అధికారులు లాంచీల్లో తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు