మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత

11 Aug, 2014 02:36 IST|Sakshi
మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత

 లక్కవరపుకోట : ఉత్తరాంధ్ర రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు (86) శనివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి పరిస్థితి విషమించి 12.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఐదు గంట లకు కోళ్ల స్వగ్రామం ఖాసాపేట శివారు ముత్యాలమ్మపాలేనికి ఆయన భౌతిక కాయూన్ని తీసుకువచ్చారు. అప్పటికే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి.
 
 విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, ఎమ్మెల్యేలు ఆర్‌వీఎస్‌కే రంగారావు, కేఏ నాయుడు, పి.నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణ, వి.రామకృష్ణబాబు, పీలా గోవింద శ్రీనివాసరావు, గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, పడాలఅరుణ, మత్స మణికుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ బి.రామారావు, ఆర్‌డీఓ జె.వెంకటరావు, డీఎస్‌పీ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు గద్దే బాబూరావు, ఆర్‌పీ భంజ్‌దేవ్‌తో పాటు ద్వారపురెడ్డి జగదీష్, డాక్డర్ పెద్దినాయుడు, వేచలపు చినరామునాయుడు, యల్లపు దమయంతి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కోళ్ల పార్దీవ దేహం వద్ద నివాళులర్పించారు. కోళ్ల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సమాచారం తెలుసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే లలితకుమారిని ఫోన్‌లో పరామర్శించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  
 
 ప్రభుత్వ లాంఛనాలతో...
 ముత్యాలమ్మపాలెం(లక్కవరపుకోట) : మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో జరిగాయి. కోళ్ల వ్యవసాయ క్షేత్రంలో ఆర్‌డీఓ జె.వెంకటరావు పర్యవేక్షణలో డీఎస్‌పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. పెద్ద కుమారుడు రాంప్రసాద్ కోళ్ల చితికి నిప్పటించారు. ముందుగా కోళ్ల పార్దీవ దేహానికి వేదపండితులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు  కోళ్ల అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
 
 సర్పంచ్ నుంచి...
 శృంగవరపుకోట/లక్కవరపుకోట : సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కోళ్ల అప్పలనాయుడు సర్పంచ్ స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లాకే రాజకీయ రంగంలో వన్నె తెచ్చారు. అజాతశత్రువుగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. 1951లో ఖాసాపేట పీఏసీఎస్ డెరైక్టర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన కోళ్ల సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా..ఏడుసార్లు గెలిచి ప్రజాభిమానం పొందారు. చంద్రబాబునాయుడు హయూంలో ప్రొటెం స్పీకర్‌గా కూడా పని చేశారు. కోళ్లకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా... ఇటీవల రెండో కుమారుడు మోహన్ మృతి చెందారు.

 

మరిన్ని వార్తలు